ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి గెలుపు తథ్యమని ఢంకా బజాయించాయి. 272 మేజిక్ ఫిగర్‌ను దాటి 300 సీట్ల వరకు అవలీలగా గెలుస్తుందని తేల్చేశాయి. ఈ నేపథ్యంలో భాజపా ప్రధాన కార్యాలయం ఈ నెల 23న సంబరాలకు ముస్తాబవుతోంది.
భాజపా గెలుపుపై ఇప్పటివరకూ ధీమాగా ఉన్న పార్టీ శ్రేణులకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. పార్టీ కార్యకర్తలు సంబరాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
"ఇప్పటివరకు మా దృష్టి మొత్తం ఎన్నికలపైనే పెట్టాం. కచ్చింతంగా 300 మార్కును అందుకుంటామన్న నమ్మకం ఉంది."
- జితేంద్ర రావత్, భాజపా మీడియా విభాగం
పంజాబ్‌కు చెందిన సమీర్ చంద్ర అనే కార్యకర్త ఎన్నికల ఫలితాల రోజు సొంత రాష్ట్రానికి వెళ్లి సంబరాల్లో పాల్గొనాలని ఉత్సాహంగా ఉన్నారు.
"మా కుటుంబంలోని 5 తరాల వారికి పార్టీతో సంబంధాలున్నాయి. మా ముత్తాత జన్ సంఘ్‌లో సభ్యులు. మరి కొంతమంది మా కుటుంబసభ్యులు ఆర్ఎస్ఎస్లో పనిచేశారు."
- సమీర్ చంద్ర, భాజపా కార్యకర్త
2019 ఎన్నికల కోసం నాలుగేళ్ల నుంచే...
2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపులో ఐటీ, సామాజిక మాధ్యమాల విభాగాల పాత్ర కీలకం. 2019 ఎన్నికల కోసం 2015 నుంచే వారు ప్రణాళిక రూపొందించి ఆచరణలో పెట్టినట్లు సమాచారం.
"ఈ ఎన్నికల ప్రచారంలో వాట్సాప్ పెద్ద పాత్ర పోషించింది. గత 6 నెలల్లో మేం 2 లక్షల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశాం. ఒక్కొక్క దానిలో 256 మంది సభ్యులున్నారు. సమాచారాన్ని ఈ గ్రూపుల ద్వారా పంచుకునే వాళ్లం. ప్రభుత్వ పథకాలు, విపక్షాలపై విమర్శలతో ప్రజలతో భావోద్వేగ బంధం ఏర్పడేలా ప్రయత్నించాం."
- భాజపా ఐటీ విభాగ సభ్యుడు
ఇదీ చూడండి: ఎగ్జిట్‌పోల్స్‌లో కచ్చితత్వం ఎంత? గతంలో ఏం జరిగింది?