'హిందూ తీవ్రవాదం' పదంపై భాజపాకు చురకలంటించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఆ పదాన్ని మొదటగా వాడిన వ్యక్తిని భాజపా మంత్రి పదవితో సత్కరించిందని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి అనంతరం భాజపాలో చేరిన ఆర్కేసింగ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు దిగ్విజయ్.
హిందూ సమాజాన్ని కాషాయ ఉగ్రవాదంగా చిత్రీకరించారని దిగ్విజయ్‌పై ఎన్నో ఏళ్లుగా ఆరోపణలు చేస్తోంది భాజపా. భోపాల్‌లో భాజపా అభ్యర్థిగా సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌కు టికెట్ ఇవ్వడాన్ని సమర్థిస్తూ ఇలాంటి విమర్శే చేశారు ప్రధాని నరేంద్రమోదీ.
"ఠాకూర్‌ను భోపాల్ బరిలోకి దింపడమనేది హిందు మతం, సంస్కృతిని తీవ్రవాదంగా పరిగణించేవారికి గట్టి సమాధానంగా మిగులుతుంది."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
మోదీ వ్యాఖ్యలపై స్పందించిన దిగ్విజయ్.. ఆర్కే సింగ్ విషయాన్ని ప్రస్తావించారు.
" హిందూ తీవ్రవాదమనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తికి లోక్‌సభ టికెట్ ఇచ్చింది భాజపానే. ఇప్పుడు మంత్రి పదవిని కూడా ఇచ్చి సత్కరించింది. దీని గురించి అమిత్ షా మాట్లాడగలరా?"
-దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత
ఇదీ చూడండి: సాధ్వి ప్రజ్ఞ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం: భాజపా