సానుభూతి కలిసొచ్చింది....
లోక్‌సభ బరిలో మొట్టమొదటిసారిగా పోటీలో నిలిచిన బండి సంజయ్ మోదీ జపంతో విజయం సాధించారు. 2014 , 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి గెలుస్తారనే ఆశ మెండుగా ఉన్నా... ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చి ఓటమి పాలయ్యారు. ఆ సానుభూతి కూడా ఒకింత ఈ ఎన్నికల్లో సంజయ్‌కి కలిసివచ్చిందనే చెప్పుకోవచ్చు. గతంలో రెండుసార్లు ఇక్కడి నుంచి భాజపా తరఫున విద్యాసాగర్ రావు గెలవడం, హిందూ ధర్మ రక్షణ కోసం పోరాటాలు, నేరెళ్ల బాధితులకు మద్దతుగా చేసిన ఆందోళనలు, యువతరంలో ఉన్న ఆదరణ బండికి ఓట్లు రాలేలా చేశాయి.
కారుకు బ్రేక్...
ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వినోద్‌కు మద్దతుగా రోడ్ షోలు నిర్వహించారు. కానీ... వినోద్‌కుమార్ స్థానికంగా ఉండరన్న విషయాన్ని ప్రత్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఒక స్థాయి నాయకులను మాత్రమే గుర్తిస్తారని అపవాదు ఆయనపై ఉండటం అనేది జనాల ఓట్లను చీల్చింది.
మూడో స్థానానికే అంకితం...
తెలంగాణ ఉద్యమంలో తాను పోషించిన పాత్రతో పాటు.. ఎంపీగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనకు అనుకూలిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ భావించారు. ప్రచారంలో వేగం లేకపోవడం, సొంత పార్టీలోనూ కుదరని సఖ్యత, లోక్‌సభ పరిధిలో ఒక్కొక్కరుగా నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లిపోవడం వంటి అంశాలతో ప్రజల నమ్మకాన్ని కోల్పోయారనే అంశం స్పష్టమవుతోంది. అందుకే పోటీలో పొన్నం ప్రభాకర్ మూడో స్థానంతో సరిపుచ్చుకున్నారు.
మొత్తంగా ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్ మధ్య సాగిన పోటీలో అనూహ్యంగా... కాషాయానికి పట్టం కట్టి కరీంనగర్ ప్రజానీకం అనూహ్య ఫలితాలిచ్చారు.
ఇవీ చూడండి: తెలంగాణలో గెలిచిన ప్రశ్నించే గొంతుక