కాపలాదారే దొంగ..
రఫేల్ వ్యవహారంలో ప్రధాని కార్యాలయమే మధ్యవర్తిగా వ్యవహరించిందని ఆరోపించింది కాంగ్రెస్. పీఎంఓ జోక్యంపై వచ్చిన వార్తలపై మోదీ వివరణకు డిమాండ్ చేసింది.
రఫేల్ ఒప్పందంలో పీఎంవో జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్. కాపలాదారే దొంగ అని తేలిందంటూ ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు.
"మోదీ రూ.30వేల కోట్లు దోపిడీ చేశారు. రక్షణ శాఖ స్పష్టంగా చెప్పింది. రఫేల్‌పై ప్రధాని ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరిపారని స్పష్టమైంది. నిజం బయటకు వచ్చింది. ప్రధాని జోక్యంపై రక్షణ శాఖ స్వయంగా అభ్యంతరం తెలిపింది. దేశ ప్రజల సంపద రూ.30వేల కోట్లను అనిల్ అంబానీకి దోచిపెట్టారు."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఛాయ్‌వాలా నుంచి రఫేల్వాలా..
రఫేల్ ఒప్పందంలో కుంభకోణం జరిగిందన్నారు పశ్చిమ్ బంగ సీఎం మమతా బెనర్జీ.
"ఎన్నికల ముందు మోదీ ఛాయ్‌వాలాగా ఉంటారు. ఎన్నికల తర్వాత రఫేల్వాలాగా మారిపోయారు. రఫేల్‌లో అవకతవకలు జరిగాయి. రఫేల్ ఒప్పందం ఓ పెద్ద కుంభకోణం. ఈ విషయంలో కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ఇస్తాం" -- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
మాకో నిబంధన... వారికో నిబంధనా?
రఫేల్ విషయంపై ప్రధాన మంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాలు జరపాలని అన్నారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సీబీఐ స్వతంత్ర విచారణ జరిపి, కుంభకోణానికి కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
భాజపా ఎదురుదాడి
ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు భాజపా నేత అనురాగ్ ఠాకూర్. దేశ రక్షణ రంగాన్ని పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా రఫేల్ ఒప్పందం చేసుకుందని స్పష్టం చేశారు.
"రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలకు అబద్ధం చెప్పడం అలవాటుగా మారింది. ఈ దేశంలో రక్షణ ఒప్పందం ఎలా జరుగుతుందో వారికి తెలియదు. "
-- అనురాగ్ ఠాకూర్, భాజపా నేత