కడపజిల్లాలోని ఓ కుగ్రామమైన వేపరాలకు చెందిన సాధారణ మహిళ విశాలాక్షి. పైళైన రెండేళ్లకు కడుపు పండితే పొంగిపోయింది. బిడ్డజననం కోసం వేయికళ్లతో ఎదురుచూసింది. పుట్టిన బిడ్డను చూసి ఆమె గొంతు మూగబోయింది. పుట్టిన పిల్లాడు మాట్లాడలేడని, ఆటిజం సమస్య కూడా ఉందని వైద్యులు తేల్చారు. ఒళ్లంతా ముడతలతో పుట్టిన ఆ పసికందును చూసి అయినవాళ్లంతా ఈసడించుకున్నారు. చదువు, ఆట పాటల్లో ఎంతో చురుకుగా ఉండే తనకు ఇలాంటి బిడ్డ పుట్టాడని బాధకు తోడు.... ఇరుగు పొరుగు వారి సూటి పోటి మాటలు ఆమెను చిత్రవధ చేశాయి. బాధను తాళలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. చివరికి షాక్ట్రీట్ మెంటుతో కోలుకుని తన ఆలోచన మార్చుకుని బిడ్డ భవిష్యత్తుకోసం అహర్నిశలు శ్రమించింది.
అప్పడు ఛీత్కారాలు.. ఇప్పుడు సత్కారాలు
ఛీత్కారాలన్నింటినీ సత్కారాలుగా.. అవమానాలన్నింటినీ ఆయుధాలుగా.. తిట్లనన్నింటినీ మెట్లుగా మార్చి తన బిడ్డకు బంగారు భవిష్యత్తునిచ్చింది. బిడ్డనే సర్వంగా భావించి నిత్యం పిల్లాడితో సాధన చేయించేది. అలా పాటలు పాడడం, లిప్‌రీడింగ్, కీబోర్డు వాయించడంలో ప్రావీణ్యున్ని చేసింది. తన స్వరపేటిక దెబ్బతిన్నా లెక్కచేయలేదు. సుమారు 500 పాటల వరకూ పిల్లాడికి నేర్పింది. బుద్ధిమాంద్యంతో పుట్టిన ఆ చిన్నారి ఇప్పుడు ఓ అసాధారణ ప్రతిభగల చిన్నారిగా మలిచి రాష్ట్రపతి పురస్కారం పొందేస్థాయికి తీసుకెళ్లింది. ఒకప్పుడు తన బిడ్డను చూడడానికే ఇష్టపడని వారందరిచేతా గ్రేట్ అనిపించింది.
తన కొడుకు జీవితాన్ని బయోపిక్‌గా తీయాలని భావించిన విశాలాక్షి సొంతంగా కథను సైతం సిద్ధం చేసింది. ఆ సినిమాలో తన తల్లిదండ్రుల పాత్రల్లో నాగచైతన్య, సమంత నటించాలని కోరుతున్నాడు ఆ పిల్లాడు.
ఎందరికో ఆదర్శం
తనలాంటి బిడ్డలున్న వారికి సహాయం చేయాలని వెంకట్ ఫౌండేషన్‌ని స్థాపించి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. బిడ్డలు ఎలా ఉన్నా వారి బాగు కోరుకునేది తల్లి. బిడ్డకు బంగారు భవిష్యత్తునిచ్చి మాతృత్వానికే మాధుర్యాన్నిచ్చిన విశాలాక్షి ఎందరికో ఆదర్శం.
ఇదీ చదవండి: పిల్లలు కనడంపై ప్రియాంకాచోప్రా ఏమంటోంది?