ఉద్యోగం, సంపాదన లేకుండా కేవలం కుటుంబ సహాయం, పొదుపు చేసుకున్న మొత్తాలతో దేశంలోని దాదాపు సగం జనాభా నెల రోజులకు మించి మనుగడ సాగించలేరని 'ఐఏఎన్ ఎస్ సీఓటర్ ఎకనామిక్ బ్యాటరీ వేవ్' సర్వేలో వెల్లడైంది. సుదీర్ఘ లాక్ డౌన్ సహా ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, ఉద్యోగాల్లో కోతలు వంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంత కాలం మనుగడ సాగించగలమనే అంశంలో కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని సర్వే పేర్కొంది.
- సర్వే ప్రకారం ఆదాయం లేకుండా నెల రోజులు కూడా మనుగడ సాగించలేమని 28.2 శాతం మంది పురుషులు పేర్కొన్నారు. ఒక నెల పాటు జీవించగలమని మరో 20.7 శాతం మంది చెప్పుకొచ్చారు. 10.7 శాతం మంది మాత్రం ఒక సంవత్సరం పాటు సౌకర్యవంతంగా బతకగలమని తెలిపారు.
- రెండు నెలలు మనుగడ సాగిస్తామని 10.2 శాతం మంది, 8.3 శాతం మంది మూడు నెలలు, 9.7 శాతం మంది 4-6 నెలలు, 5.7 శాతం మంది సంవత్సరం కన్నా తక్కువ రోజులు జీవించగలమని సర్వేలో స్పష్టం చేశారు.
- ఇక మహిళల విషయానికొస్తే.. 19.9శాతం మంది ఎలాంటి ఉద్యోగం, ఆదాయం లేకుండా నెల రోజుల కన్నా తక్కువ మనుగడ సాగిస్తామని పేర్కొన్నారు. 28.4 శాతం మంది మాత్రం ఒక నెల పాటు సౌకర్యంగా జీవిస్తామని వెల్లడించారు. 11.5 శాతం మంది సంవత్సరానికి పైగా బతకగలమని తెలిపారు.
దేశ జనాభాలో సగం
ఈ గణాంకాలను బట్టి నెల రోజులు లేదా అంతకన్నా తక్కువ అని చెప్పినవారి సంఖ్య దేశ జనాభాలో దాదాపు సగం ఉంటుందని సీఓటర్ లెక్కగట్టింది. జూన్ మొదటి వారంలో ఈ గణాంకాలు స్వీకరించినట్లు తెలిపింది. 500 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 1,397 మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు వెల్లడించింది.
వృద్ధులు భళా.. యువత డీలా!
- ఎలాంటి ఆదాయం లేకుండా వృద్ధులే(60 ఏళ్ల పైబడిన వారు) ఎక్కువ రోజులు మనుగడ సాగించే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
- 19.2 శాతం మంది వృద్ధులు ఏకంగా సంవత్సరం పాటు సౌకర్యవంతంగా జీవిస్తామని పేర్కొన్నట్లు సర్వే వెల్లడించింది స్పష్టం చేసింది. మొత్తం సర్వేలో ఇదే అత్యధికమని వెల్లడించింది.
- కాగా.. ఈ రేటు యువతలో అత్యల్పంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాయం లేకపోతే మనుగడ సాగించే అవకాశం నెల రోజుల కన్నా తక్కువేనని 28.6 శాతం మంది యువత(25-40 మధ్య వయసు) చెప్పినట్లు సర్వే పేర్కొంది.
ఉన్నత విద్య, ఆదాయాలు
ఉన్నత విద్యనభ్యసించిన వారితో పాటు, అధిక ఆదాయం ఉన్న వారిలో మనుగడ రేటు అధికంగా ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఉన్నత విద్య అభ్యసించిన వారిలో 31.6 శాతం మంది సంవత్సరం పాటు ఎలాంటి ఆదాయం లేకున్నా మనుగడ సాగించగలమని పేర్కొనగా... అధిక ఆదాయం ఉన్న వారిలో ఈ రేటు 29.6 శాతంగా ఉంది.
సామాజిక, భౌగోళిక అంశాల పరంగా...
మనుగడ రోజులు నెల రోజులకన్నా తక్కువ ఉన్న సామాజిక వర్గాల్లో ముస్లింలు తొలి స్థానంలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఏకంగా 38.4 శాతం మంది నెల రోజుల కన్నా తక్కువే మనుగడ సాగిస్తామని చెప్పగా.. 30.2 శాతం మంది కనీసం నెల రోజులు జీవనం సాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రాంతాలవారీగా చూస్తే.. పశ్చిమ భారత దేశంలో మనుగడ రేటు మెరుగ్గా ఉంది. ఇక్కడ ఆదాయం లేకున్నా 17.2 శాతం మంది నెల కన్నా తక్కువ రోజులు జీవిస్తామని పేర్కొన్నారు. మరోవైపు తూర్పు ప్రాంతాల్లో ఈ సంఖ్య 30.4 శాతంగా ఉంది. మొత్తం మీద 48 శాతం మంది ఆదాయం లేకున్నా కనీసం నెల లేదా నెల కన్నా తక్కువ రోజులు మనుగడ సాగిస్తామని చెప్పినట్లు సర్వే పేర్కొంది.