61 ఏళ్ల బామ్మ ఓ పండంటి పాపను ప్రసవించింది. ఏంటీ అవాక్కయ్యారా! మీరు విన్నది నిజమే. ఇంత లేటు వయస్సులో ఇదెలా సాధ్యమనుకుంటున్నారా! కన్నప్రేమకు ఏదైనా సాధ్యమే.
అమెరికా నెబ్రాస్కాలోని ఒమాహ పట్టణానికి చెందిన 'సిసెలీ' అనే 61 ఏళ్ల బామ్మ సరోగసీ పద్ధతిలో తన మనవరాలికి జన్మనిచ్చింది. ఆ పాపకు ముద్దుగా 'ఉమా లూయీస్ డౌగర్తీ ఎలెడ్జ్' గా నామకరణం చేశారు.
సిసెలీ బామ్మ కుమారుడు 32 ఏళ్ల మాథ్యూ ఎలెడ్జ్ ఓ స్వలింగ సంపర్కుడు. అతడి జీవిత భాగస్వామి ఇలియట్ డౌగర్తీ (29). ఈ పురుష జంట తమకు పిల్లలు కావాలని కోరుకుంది. వారి అభిలాష అర్థం చేసుకున్న సిసెలీ... ఆ బిడ్డకు తనే జన్మనివ్వాలని నిర్ణయించుకున్నారు.
వయసు రీత్యా కష్టమని తెలిసినా, ఎండోక్రైనాలజిస్టుల పర్యవేక్షణలో సరోగసి ద్వారా పిల్లలను కనడానికి ఆమె సిద్ధమయ్యారు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. సరోగసీ సాధ్యమవుతుందని తెలిపారు.
సిసెలీ కుమార్తె లియా యెరిబే నుంచి అండం, కుమారుడు మాథ్యూ నుంచి శుక్రకణాలు సేకరించి, వైద్యులు పిండాన్ని అభివృద్ధి చేశారు. సిసెలీ గర్భంలో ప్రవేశపెట్టారు. చివరకు ఆమె ఈ మార్చి 25న మనవరాలికి జన్మనిచ్చింది. 5 పౌండ్ల బరువుతో పాప ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి :హికికొమోరి: జపాన్లో ఒంటరి పక్షుల వ్యథ