Covaxin on Children: పిల్లలపై నిర్వహించిన కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. 2-18 ఏళ్ల వారిపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో కొవాగ్జిన్ ఉత్తమ ఫలితాలను కనబరిచిందని వెల్లడించింది. కొవాగ్జిన్ టీకా వల్ల పెద్దలతో పోలిస్తే పిల్లల్లో 1.7 రెట్లు ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలిపింది. వారిలో తీవ్ర దుష్పరిణామాలేవీ చూపలేదని పేర్కొంది.
Covaxin result on Children: పిల్లలకు కొవాగ్జిన్ టీకా ఇచ్చేందుకు ఇటీవల భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర అనుమతి మంజూరు చేసింది. గత కొంతకాలంగా పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్.. ఈ నేపథ్యంలో వాటి ఫలితాలను ప్రకటించింది. చిన్నారుల వ్యాక్సిన్‌కి సంబంధించి 2, 3 దశల క్లినికల్ ట్రయల్స్ డేటాను భారత్ బయోటెక్ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగిన క్లినికల్ ట్రయల్స్‌లో నిర్దేశించిన వయసు పిల్లల్లో 527 మంది పాల్గొన్నారు.
3 గ్రూపులుగా
వీరిలో 12 నుంచి 18 ఏళ్లు, 6 నుంచి 12 ఏళ్లు, 2 నుంచి 6 ఏళ్ల మధ్య మూడు గ్రూపులుగా విభజించి ట్రయల్స్ చేపట్టగా అందరిలోనూ రెండో డోస్ ఇచ్చిన నాలుగు వారాల తర్వాత యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. అవి అన్ని రకాల వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నాయని ప్రకటించింది. 2- 18 ఏళ్ల వయసు పిల్లల కోసం ప్రపంచవ్యాప్తంగా తయారైన ఏకైక టీకా కొవాగ్జిన్ కావటం సంతోషకరమని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: వేర్వేరు దేశాల్లో నాలుగుసార్లు టీకా.. అయినా కరోనా పాజిటివ్