కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలన్న తెలంగాణ నిర్ణయానికి అడ్డంకి ఏర్పడింది. విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు కోరాయి. అపెక్స్ కౌన్సిల్‌లో అంగీకారం మేరకు 2015లో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న అప్లికేషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
కృష్ణా నదీ జలాల వివాదంలో బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ నియమిత కాలం పూర్తి కావడంతో కొత్త బెంచ్ ఏర్పాటు చేయాలని 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలకే పరిమితం కావాలని.. నాలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొత్తగా ఏమీ లేదని కర్ణాటక పేర్కొంది. ఇదే విషయంలో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ 2015లో రిట్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు, నీటి పంపకాల విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని పలుమార్లు కోరింది.
ఈ క్రమంలోనే విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల అంశాలపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అయితే సుప్రీంలో పిటిషన్ ఉండగా.. తాము నిర్ణయం తీసుకోలేమని కేంద్ర జల్‌శక్తి శాఖ తెలుపగా.. పిటిషన్ ఉపసంహరణకు సిద్ధమని అపెక్స్ కౌన్సిల్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనిని ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టు ద్వారానే సమస్య పరిష్కారం కావాలన్నాయి. 2 రాష్ట్రాలు వ్యతిరేకించడంతో పిటిషన్‌ను ధర్మాసనానికి బదిలీ చేయాలని ప్రభుత్వం కోరింది. ధర్మాసనం వద్దే అనుమతి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ఈ మేరకు పిటిషన్‌ను ధర్మాసనానికి పంపుతామని ఛాంబర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుధ్‌బోస్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: NGT: 'నిపుణుల కమిటీ'పై ఎన్జీటీ అసహనం.. పర్యావరణ ఉల్లంఘనలపై నివేదికకు మరోసారి ఆదేశం