జూనియర్ వైద్యులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి చర్చలు జరిపారు. బీఆర్కే భవన్‌లో జూడాలతో సమావేశమైన మంత్రి... వైద్యుల ఐదు ప్రధాన డిమాండ్లపై చర్చించారు.
గాంధీ ఆస్పత్రిలో త్వరలో కొవిడ్ సహా ఇతర వైద్య సేవలు కొనసాగుతాయని మంత్రి ఈటల వెల్లడించారు. కొవిడ్ రోగులను ఇతర ఆస్పత్రుల్లోనూ చేర్చుకునేందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. వైద్యుల రక్షణ కోసం ఎస్‌పీఎఫ్ బలగాలను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని సమాచారం చేరవేయాలని మంత్రి చెప్పినట్లు జూడాల వెల్లడించారు. ఆ బృందంతో ప్రతివారం మాట్లాడి సమస్యలు తెలుసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని వివరించారు. పోస్టుల భర్తీపై సీఎంతో చర్చిస్తామని మంత్రి పేర్కొన్నట్లు జూడాలు స్పష్టం చేశారు. మంత్రి హామీతో భవిష్యత్ కార్యాచరణపై అంతర్గతంగా చర్చించుకుంటామని జూనియర్ వైద్యులు తెలిపారు.