తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు(Bail to TDP Leader Pattabhi Ram) చేసింది. ఏపీ సీఎం జగన్‌పై వ్యాఖ్యల కేసులో రెండురోజుల క్రితం అరెస్టయిన పట్టాభి బెయిల్ పిటిషన్‌పై.. కోర్టులో శనివారం వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనల తర్వాత...... ఏపీ హైకోర్టు బెయిల్(Bail to TDP Leader Pattabhi Ram) మంజూరు చేసింది. ప్రస్తుతం పట్టాభి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పట్టాభికి బెయిల్ రావడంపై తెలుగుదేశం శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
అరెస్టు ఇలా..
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను బుధవారం రాత్రి విజయవాడ పటమటలోని ఆయన ఇంటివద్ద పోలీసులు హైడ్రామా నడుమ అరెస్టు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిపై పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచీ ఆయన ఇంటివద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. అరెస్టు చేస్తారనే వార్తలు రావడంతో పట్టాభి బయటకు రాకుండా తన ఇంట్లోనే ఉండిపోయారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు మీడియా, పార్టీ శ్రేణులు ఇంటి వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాము అరెస్టు చేయడానికి రాలేదని, మంగళవారం జరిగిన దాడిపై స్టేట్‌మెంట్ నమోదు చేసేందుకు వచ్చామని పోలీసులు తొలుత చెప్పారు. రాత్రి 8.30 సమయంలో పోలీసుల హడావుడి పెరిగింది. అదనపు బలగాలను దింపారు. రోప్ పార్టీ వచ్చి.. మీడియా, నాయకులను దూరంగా తీసుకెళ్లారు. 9 గంటలకు పోలీసులు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ముందుగా ఇంటి ప్రధానద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నం చేశారు. సెంట్రల్‌లాక్ కావడంతో తెరుచుకోలేదు. ఇంటి వెనక్కి వెళ్లి వంటగది తలుపులు పగలగొట్టి 30మందికి పైగా పోలీసులు లోపలికి ప్రవేశించారు. పట్టాభిని అరెస్టు చేసి.. ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు. తెదేపా నేతలు, కుటుంబసభ్యులు అడ్డుకున్నా.. వారిని పక్కకు నెట్టి పట్టాభిని వాహనంలో ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటనను కవర్ చేయకుండా మీడియాను దూరంగా పంపించారు. పట్టాభిని అరెస్టుచేసి రాత్రి 10 గంటలకు తోట్లవల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు.
పట్టాభి వీడియో
పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత తనకు ఏం జరిగినా ఏపీ సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌దే బాధ్యత అని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. అరెస్టుకు ముందు వీడియో సందేశం మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం తన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని వీడియో ద్వారా వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తెదేపా తరఫున పోరాడుతున్నందుకే తనపై కక్షగట్టి పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసి, ఇంట్లోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసిన నిందితులను పట్టుకోకుండా తనను అరెస్టు చేయడం ఏమేరకు సబబో ఏపీ ప్రజలు ఆలోచించాలని పట్టాభి విజ్ఞప్తి చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేసి ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాడి చేసిన విధంగా దాడి చేయాలని పోలీసులు చూస్తున్నారని, ఏం జరిగినా కోర్టులో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని హెచ్చరించారు. న్యాయస్థానం, రాజ్యాంగంపై తనకు పూర్తి నమ్మకం ఉందని న్యాయబద్ధంగా తన పోరాటం కొనసాగుతుందని పట్టాభి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: