గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం (GRMB meeting) కొనసాగుతోంది. జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో జరుగుతున్న సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగును బోర్డు ఆధీనంలోకి తీసుకునే అంశంపై చర్చిస్తున్నారు. నిన్నటి ఉపసంఘం సమావేశ నివేదికపైనా బోర్డు భేటీలో దృష్టిపెట్టారు. ప్రాజెక్టుల నిర్వహణ, నిధులు సంబంధిత అంశాలపై చర్చ జరుగుతోంది. ఈనెల 14 నుంచి అమల్లోకి రానున్న గెజిట్ నోటిఫికేషన్‌ను వాయిదా వేయాలని కోరుతున్నామని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు బోర్డ్ పరిధిలోకి వెళ్లనుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కోరుతున్నట్టుగా మిగతా ప్రాజెక్టులు బోర్డ్ పరిధిలోకి ఇప్పట్లో కుదరదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని.. గడువు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసిన అంశాన్ని రజత్‌కుమార్ గుర్తుచేశారు.