టాలీవుడ్లో సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ్టి ఈడీ విచారణకు నటుడు తనీష్ హాజరయ్యారు. మనీలాండరింగ్ వ్యవహారంలో సుమారు 7 గంటలపాటు తనీష్‌ను ఈడీ అధికారులు విచారించారు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై ప్రశ్నించారు. తనను మళ్లీ విచారణకు రమ్మని ఈడీ చెప్పలేదన్న నటుడు తనీష్.. విచారణకు రమ్మంటే మళ్లీ వస్తానన్నారు.
మనీలాండరింగ్ వ్యవహారంలో ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, దగ్గుబాటి రానా, రవితేజ, నవదీప్‌తో పాటు డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్ క్లబ్ మేనేజర్ హరిప్రీత్ సింగ్, ముమైత్‌ఖాన్‌ను.. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రశ్నించారు.
కెల్విన్‌కు సమన్లు..
మాదక ద్రవ్యాల విక్రేత కెల్విన్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో కెల్విన్‌పై బాలానగర్ ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను ఇటీవల విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. డిసెంబరు 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
కెల్విన్‌పై 2017లో ఆబ్కారీ శాఖ కేసు నమోదు చేసింది. అనంతరం కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా పలువురు సినీనటులను ఆబ్కారీ శాఖ విచారించింది. కెల్విన్‌తో పాటు నిఖిల్ శెట్టి అలియాస్ నిశ్చయ్, రవికిరణ్‌పై ఎక్సైజ్ అధికారులు జనవరిలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కొవిడ్ పరిస్థితుల కారణంగా కేసు విచారణ ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఇదీచూడండి: