దేశంలో 12 నుంచి 18 ఏళ్ల వయసు వారి కోసం జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దిల్లీ హైకోర్టుకు శుక్రవారం సమర్పించిన ప్రమాణపత్రంలో కేంద్రం నివేదించింది. జైడస్ క్యాడిలా టీకా ఈ వయస్సువారిపై క్లినికల్ పరీక్షలను పూర్తి చేసుకుందని వెల్లడించింది. పిల్లలపై ఈ టీకా వినియోగానికి త్వరలోనే అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పింది.
అయితే.. భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) కొన్నిరోజుల క్రితమే జైడస్ క్యాడిలా టీకాకు అత్యవసర అనుమతులు ఇచ్చిందని సోమవారం విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. మరోవైపు.. దేశవ్యాప్తంగా తక్కువ వ్యవధిలో 100 శాతం మేర టీకా పంపిణీ చేసేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తన ప్రమాణ పత్రంలో పేర్కొంది.
చిన్నారులపై టీకా ప్రయోగాలు నిర్వహించేందుకు మే 12న భారత్ బయోటక్ సంస్థకు కూడా అనుమతులు ఇచ్చినట్లు కేంద్రం చెప్పింది.
ఇదీ చూడండి: Corona Cases: దేశంలో మరో 38,949 కరోనా కేసులు