YSRCP Incharges List : ప్రశ్నించే గొంతును కోస్తారని వైఎస్సార్సీపీ సమన్వయకర్తల మూడో జాబితా ప్రకటనతో వైఎస్సార్సీపీ అధిష్ఠానం మరోసారి రుజువు చేసింది. "దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా? నేనేం తప్పు చేశానని నాకు టికెట్ ఆపేస్తారు?" అంటూ ప్రశ్నించిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు (MLA MS Babu)ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. సీఎం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని ఆ ఎమ్మెల్యే చేసిన విజ్ఞాపనను పరిగణనలోకి తీసుకోకుండా ఇన్‌ఛార్జిగా డాక్టర్ మూతిరేవుల సునీల్‌కుమార్‌ను నియమించారు. ఈయన 2014-19 మధ్య ఇదే పూతలపట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు బాబుకు అన్యాయం చేసినట్లే 2019లో సునీల్‌ను పక్కన పెట్టారు. అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియో అప్పట్లో సంచలనమైంది. జగన్‌ను కలిసేందుకు లోటస్‌పాండ్‌కు వెళ్లి పడిగాపులు కాసినా నాడు దర్శనభాగ్యం దక్కలేదు. అయిదేళ్ల తర్వాత మళ్లీ ఆయన్ను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఎంపిక చేశారు.
సీఎం మాట్లాడినా అసంతృప్తిపై మెత్తబడలేదని మాజీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి పెనమలూరు టికెట్ గల్లంతు చేశారు. రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి ప్రభుత్వంలో, పార్టీలో అన్నింటా ప్రాధాన్యమున్న సామాజికవర్గానికి చెందిన ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని పార్టీ ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. కాపు సామాజికవర్గానికి చెందిన చిత్తూరు, దర్శి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానాల్లోనూ విజయానందరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డిలను సమన్వయకర్తలుగా నియమించారు. శివప్రసాదరెడ్డి తల్లి ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.
వైఎస్సార్సీపీలో ముగిసిన మార్పులు చేర్పుల పర్వం- సిట్టింగులకు జగన్ మొండిచేయి
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నియోజకవర్గంలో అరాచకాలు చేస్తున్నారని ఆయన భార్యే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దాంతో అప్పటివరకూ టెక్కలి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి ఆయన భార్య వాణిని అక్కడ నియమించారు. కొన్ని నెలలు కూడా గడవక ముందే, తిరిగి దువ్వాడ శ్రీనివాస్‌నే టెక్కలి సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఉమ్మడి శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్ పిరియా విజయకు ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి కృష్ణా జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక భర్త ఉప్పాల రామును పెడన అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యుడిగా నియమించారు. ఇచ్ఛాపురంలో ప్రస్తుత సమన్వయకర్తగా ఉన్న పిరియా సాయిరాజ్‌ను తప్పించి, ఆయన భార్య పిరియా విజయకు బాధ్యత అప్పగించారు. ఉమ్మడి శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్ పిరియా విజయను ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జిగా నియమించినందున జడ్పీ ఛైర్‌పర్సన్ పదవికి ఇచ్ఛాపురం జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.
రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని మూడు రోజుల క్రితం సీఎం జగన్ పిలిచి మాట్లాడి ఈసారీ మీరే కొనసాగుతారని చెప్పి పంపారు. కానీ, గురువారం ఉమ్మడి కడప జడ్పీ ఛైర్‌పర్సన్, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డిని సమన్వయకర్తగా ప్రకటించారు. మల్లికార్జునరెడ్డి 2019 ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. ఆ పదవిని వదులుకుని అప్పట్లో ఆయన వైకాపాలో చేరారు. అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆయనకు వైసీపీ పెద్దలు హామీ ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా మల్లికార్జునరెడ్డికి ఏ పదవీ దక్కలేదు. ఇప్పుడు టికెట్ కూడా గల్లంతైంది.
పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా
ఉమ్మడి కడప జడ్పీ ఛైర్‌పర్సన్ ఆకేపాటి అమర్నాథరెడ్డిని ఇప్పుడు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ బాధ్యుడిగా నియమించారు. ఆయన స్థానంలో వేరెవరినీ ఇంకా ఎంపిక చేయలేదు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకు బుధవారం రాత్రి పార్టీ అధిష్ఠానం పెద్దలు ఫోన్ చేసి సత్యవేడుకు వెళ్లాలని చెప్పారు. ఆయన వెళ్లలేనని ఎంత చెప్పినా ముఖ్యమంత్రి నిర్ణయమని ఆయనకు చెప్పారు. దీంతో ఆయన వర్గీయులు భారీసంఖ్యలో గురువారం తాడేపల్లికి చేరుకుని తమ ఎమ్మెల్యేను సూళ్లూరుపేటలోనే కొనసాగించాలని ఆందోళనకు దిగారు. అదే విషయమై రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తిరుపతి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిలను కలిసి డిమాండు చేశారు. సాయంత్రం సంజీవయ్య సీఎంను కలిసి మాట్లాడారు. సీఎం ఆయనకు సూళ్లూరుపేట టికెట్‌నే ఖరారు చేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు డాక్టర్ ఆదిమూలపు సతీష్‌ను ఇప్పుడు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. కొంతకాలంగా ఆయన అక్కడ క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌ను పక్కనపెట్టి మరీ పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడు సిటింగ్ ఎమ్మెల్యే సుధాకర్‌కు మొండిచేయి చూపారు. దీంతో సురేష్ కుటుంబానికి రెండు టికెట్లు వచ్చాయి. మరోవైపు సురేష్ బావ డాక్టర్ తిప్పేస్వామి ప్రస్తుతం మడకశిర ఎమ్మెల్యే. ఆయన్ను ఈసారి మార్చకపోతే సురేష్ కుటుంబానికే మూడు టికెట్లు ఇచ్చినట్లు అవుతుంది. మరోవైపు తణుకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌ను ఏలూరు లోక్‌సభ బాధ్యుడిగా నియమించారు. మంత్రిని తణుకులో కొనసాగిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.
టీడీపీ ఎంపీ కేశినేని నాని బుధవారం సాయంత్రం సీఎం జగన్‌ను కలిశారు. గురువారం రాత్రికి ఆయన్ను విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేశారు. పార్టీలో చేరకుండానే ఆయనకి టికెట్ ఖరారు చేసేశారు.
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీ నియోజవర్గానికి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి లోక్‌సభకు మార్చారు. ఇటీవలే ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లకు నమస్కరించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మంత్రి గుమ్మనూరు జయరాం మూడు రోజులుగా సీఎంఓ చుట్టూ తిరుగుతున్నారు. ఆయనకు ఎక్కడా అవకాశం ఉండదనే ప్రచారం విస్తృతంగా జరిగింది. మూడు రోజులపాటు పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి చుట్టూ తిరిగిన ఆయన ఎట్టకేలకు కర్నూలు లోక్‌సభ టికెట్‌ను దక్కించుకోగలిగారు.
మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మిని విశాఖ లోక్‌సభ ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శీను)ను విజయనగరం లోక్‌సభ బాధ్యుడిగా నియమించాలని నిర్ణయించినా, గురువారం జాబితాలో ఆయన పేరు ప్రకటించలేదు.