YSRCP Govt Destroyed Industrial Parks: పారిశ్రామిక పార్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వేలాది ఎకరాల భూములు సేకరించింది. తల్లి లాంటి నేలను వదులుకోవడానికి ఇష్టం లేకున్నా తమ త్యాగంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించారు. తమ పిల్లలకు స్థానికంగా ఉపాధి దొరుకుతుందని ఆశ పడ్డారు. వాళ్ల నిరీక్షణకు ఏళ్లు గడిచిపోయాయి. కానీ పరిశ్రమలు ఏర్పాటుకాలేదు. వాళ్ల పిల్లలకు ఉపాధీ దొరకలేదు. ఏపీఐఐసీ దగ్గర బల్క్, ఇండస్ట్రియల్ పార్కుల్లో కలిపి 92 వేల 236.79 ఎకరాల భూములు వృథాగా పడివున్నాయి.
అందులో ప్రభుత్వ భూములుపోనూ రైతుల నుంచి సేకరించిన పట్టా భూములు 50 శాతం వరకు ఉంటాయి. వీటికి ఎకరాకు రూ.2 లక్షల చొప్పున పరిహారంగా ఇచ్చినా రైతులకు చెల్లించిన మొత్తం రూ.922.36 కోట్లు అవుతుంది. అంత భారీ మొత్తం ఖర్చు చేసి తీసుకున్న భూములన్నీ ఇప్పుడు ముళ్లపొదలతో నిండిపోయాయి. వాటి మధ్యలో ఏపీఐఐసీ ఏర్పాటుచేసిన బోర్డులు చూస్తేగానీ పారిశ్రామిక పార్కుగా గుర్తించడమూ కష్టమే.
కియా పరిశ్రమకు అనుబంధంగా ఏర్పాటుచేసే పరిశ్రమల కోసం అనంతపురం జిల్లా అమ్మవారుపల్లిలో 457.19 ఎకరాలు, ఎర్రమంచిలో 635 ఎకరాలు సేకరించారు. అమ్మవారుపల్లిలో 128.79 ఎకరాల్లో 66 ప్లాట్లు అభివృద్ధి చేశారు. అవన్నీ ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. లీజు విధానంలో కేటాయిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడంతో కియా కార్ల పరిశ్రమను పొరుగు రాష్ట్రానికి తరలించాలన్న ఆలోచన చేశారనే సమాచారం అప్పట్లో సంచలనంగా మారింది. 2021-22లో ప్రకాశం జిల్లా పామూరు మండలం మాలకొండాపురంలో 55.48 ఎకరాల్లో ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు అభివృద్ధి చేసింది. అందులో నిర్మించిన 347 ప్లాట్లలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటుకాలేదు.
2019-20లో పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో 54.63 ఎకరాల్లో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు అభివృద్ధి చేసి 26.46 ఎకరాల్లో 309 ప్లాట్లు సిద్ధం చేసింది. అవికూడా ఖాళీగానే ఉన్నాయి. 2020-21లో కర్నూలు జిల్లా తంగడంచలో 50.95 ఎకరాల్లో ఏర్పాటుచేసిన ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుకు పారిశ్రామికవేత్తల నుంచి డిమాండ్ లేదంటూ మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం పక్కన పెట్టేసింది. 2019-20లో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆర్.అనంతపురంలో 428.60 ఎకరాలు సేకరించి రోడ్లు, విద్యుత్ లైన్లు అభివృద్ధి చేసి వదిలేసింది.
రాష్ట్రంలో మొత్తం 19 వేల 435.27 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 40 పారిశ్రామిక పార్కులు, కారిడార్లలో మౌలిక సదుపాయాల కోసం వెయ్యి కోట్ల 13 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపింది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. చాలాచోట్ల రోడ్లు, విద్యుత్ లైన్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి.
పోర్టుల భూసేకరణ కోసం పరిశ్రమశాఖ మార్గదర్శకాలు జారీ
ఆశించిన స్థాయిలో పరిశ్రమలు రాకపోవడంతో చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైంది. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరలేదు. అనకాపల్లి జిల్లా కోడూరులో 60 ఎకరాల్లో 290 ప్లాట్లతో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేశారు. ఈ పార్కు లేఔట్ మార్చాలంటూ ఏడాదిన్నరగా ప్లాట్లను ఎవరికీ కేటాయించాకుండా వృథాగా ఉంచేశారు. రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధాన ఆధారం. దాని తర్వాత ఎమ్ఎస్ఎమ్ఈ ల ద్వారానే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతోంది.
పార్కులు ఏం చేశాయ్..! పూర్తి కావచ్చిన ఉద్యానవనాలనూ పట్టించుకోని ప్రభుత్వం
చిన్న పరిశ్రమలు విరివిగా రావాలంటే ఒక చోదకశక్తి కావాలి. భారీ పరిశ్రమల ఏర్పాటుతోనే అది సాధ్యమవుతుంది. ఇదేమీ పట్టించుకోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం లేకుండా చేసింది. గతంలో ఏర్పాటైన భారీ పరిశ్రమలను రాజకీయ కక్షతో వేధింపులకు గురి చేసింది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావాలంటేనే భయపడేలా చేసింది. ప్రభుత్వ తీరు ఎమ్ఎస్ఎమ్ఈ ల ఉనికికే ప్రమాదంగా మారింది.
కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత మార్కెట్ ఒడుదొడుకులతో 20 శాతం చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని పారిశ్రామిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. చిన్న పరిశ్రమలను చేయి పట్టుకుని నడిపిస్తామన్న జగన్ మాటలు కేవలం గొప్పలుగానే మిగిలిపోయాయి. రెండేళ్లుగా ప్రోత్సాహకాలు చెల్లించకుండా చిన్న పరిశ్రమలను ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం కొవిడ్‌తో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీలో రూ.188 కోట్ల విద్యుత్ రాయితీలను ఇప్పటికీ చెల్లించలేదు. ప్రభుత్వ శాఖల కొనుగోళ్లలో 25 శాతం ఎమ్ఎస్ఎమ్ఈ ల నుంచి ఉండాలన్న సీఎం ఆదేశాలు నేటికీ అమలు కాలేదు.
విజయవాడలో అధ్వానంగా దర్శనమిస్తున్న పార్కులు - పట్టించుకోని వీఎంసీ అధికారులు