కేరళలోని కొచ్చికి చెందిన హన్నా అలీస్ సిమోన్.. తాజాగా విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 500 మార్కులకు 496 మార్కులు సాధించింది. వికలాంగుల కోటాలో దేశంలోనే మెుదటి ర్యాంకు సాధించింది. చదువుల్లోనే కాకుండా సిమోన్ వివిధ రంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించింది. స్ఫూర్తినిచ్చే వ్యాఖ్యాతగా, గాయనిగా, యూట్యూబర్‌గా రాణిస్తోంది. ఆరుగురు యువతులకు సంబంధించి ఆరు చిన్న కథలతో ఓ పుస్తకాన్ని కూడా రచించింది. ఆ పుస్తకాన్ని "వెల్‌కమ్ హోమ్" పేరుతో ఈనెల 15న ఆవిష్కరించింది.
సిమోన్‌కు చూపు లేనప్పటికీ ఆమె తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మామూలు అమ్మాయిలాగే పెంచారు. తమ ఇద్దరు కుమారుల మాదిరిగానే ఆమెను చూశారు. చదువు విషయంలోనూ ఎలాంటి తారతమ్యాలు చూపలేదు. వికలాంగుల పాఠశాలలో కాకుండా సాధారణ పాఠశాలలోనే చేర్పించారు. ఆ సమయంలో తోటి వారు తనను దగ్గరకు రానిచ్చేవారు కాదని సిమోన్ తెలిపింది. పాఠశాల స్థాయిలోనే హేళనలు, అవమానాలు ఎదుర్కొన్నట్లు వివరించింది. అవే తనను జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలనే బలమైన కోరికను రగిలించాయని పేర్కొంది. చిన్నతనంలో అవమానాలు ఎదుర్కొవడం వల్లే ప్రస్తుతం పెద్ద సవాళ్లనైనా అధిగమిస్తున్నట్లు సిమోన్ వెల్లడించింది.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
సిమోన్ ఎదుగుదలలో ఆమె తల్లిదండ్రుల కృషి చాలానే ఉంది. వికలాంగురాలు అని ప్రత్యేక దృష్టితో చూస్తే ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉందని సిమోన్‌ను అందరిలాగే పెంచారు. మైదానంలో మిగతా పిల్లలు పరుగెడుతుంటే చేతులు పట్టుకుని సిమోన్‌ను నడిపించినట్లు ఆమె తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. సిమోన్‌కు అంత ఆత్మవిశ్వాసం రావడానికి ఆమె తల్లి సహకారం, ప్రోత్సాహమే కారణమని తండ్రి సిమోన్ మాథ్యూస్ వెల్లడించారు. సిమోన్ ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి ముందుకు సాగుతోందని మాథ్యూస్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: