కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari News) తన సంపాదన గురించి కీలక విషయాన్ని వెల్లడించారు. యూట్యూబ్ తనకు నెలకు రూ.లక్షలు చెల్లిస్తున్నట్లు(Nitin Gadkari Youtube) వెల్లడించారు. కరోనా సమయంలో తాను రెండే విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఒకటి వంట చేయడం, రెండు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లెక్చర్లు ఇవ్వడమని వివరించారు. తన యూట్యూబ్ ఛానల్లో(Nitin Gadkari Youtube Channel) పోస్ట్ చేస్తున్న ఈ వీడియో సందేశాలకు విశేష ఆదరణ లభించడం వల్ల నెలకు రూ.4లక్షలకుపైగా ఆదాయం సమకూరుతున్నట్లు చెప్పారు.
'కరోనా సమయంలో నేను షెఫ్‌గా మారాను. ఎన్నో వంటలు చేశాను. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 950 లెక్చర్లు ఇచ్చాను. విదేశీ యూనివర్సిటీల విద్యార్థులకూ క్లాసులు చెప్పాను. వీటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను. నా ఛానల్‌కు వ్యూస్ భారీగా వచ్చాయి. దీంతో యూట్యూబ్ నెలకు రూ.4లక్షలు రాయల్టీగా చెల్లిస్తోంది' అని గడ్కరీ అన్నారు.
దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే(DME) పనులను సమీక్షించిన సందర్భంగా రత్లాంలో గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు గడ్కరీ(Nitin Gadkari Expressway). దిల్లీ, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ను కలిపే ఈ రహదారి నిర్మాణ పనులు పురోగతిని సమీక్షించారు. మధ్యప్రదేశ్‌లో 245కిలోమీటర్లకు గానూ 106కి.మీ. రోడ్డు నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు.
" DME ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే. 1350కి.మీ మేర ఉన్న ఈ రహదారితో ప్రజలు ముంబయి నుంచి దిల్లీకి 12 నుంచి 12.5 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే భారతదేశంలోని అతిపెద్ద కంటైనర్ పోర్టు అయిన జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు-ఎన్హవా శేవ వద్ద ముగుస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలను కలుపుకొంటూ ఈ రహదారి ఉంటుంది. 2023నాటికి నిర్మాణం పూర్తవుతుంది. దీని వల్ల వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా రూ.1300కోట్లు కేటాయించి సంరక్షణ చర్యలు తీసుకున్నాం. మొదటగా 8 లైన్ల రోడ్డు నిర్మిస్తున్నాం. తర్వాత రద్దీని బట్టి 12 లైన్లకు విస్తరిస్తాం."
- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి.
ఈ రహదారి మార్గంలో పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, సీఎన్జీ పంప్ స్టేషన్లు, ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లను కూడా నిర్మిస్తున్నట్లు గడ్కరీ వివరించారు. దీని కోసం 670 హెక్టార్ల భూమిని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. దేశాభివృద్ధిలో రోడ్డు రవాణా చాలా కీలకమని పేర్కొన్నారు.
గడ్కరీ(Union Minister Nitin Gadkari News) ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెబుతారని పేరుంది. అందుకు తగ్గట్టు గానే ఆయన భారత్‌లో బాగా పనిచేసేవారికి ప్రశంసలు దక్కవని ఈ సందర్భంగా అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో రాజకీయ నాయకులెవరూ ఆనందంగా లేరని గడ్కరీ (Nitin Gadkari Latest News) చెప్పుకొచ్చారు. మంత్రి పదవి రాలేదని ఎమ్మెల్యే, సీఎం పీఠం దక్కలేదని మంత్రులు అసంతృప్తిగా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భాజపా తరచూ సీఎంలు మార్చుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపైనా పరోక్షంగా ఛలోక్తి విసిరారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: వ్యాక్సినేషన్లో మళ్లీ రికార్డ్.. మధ్యాహ్నం వరకే కోటి డోసుల పంపిణీ