షాపుల యజమానులకు తెలియకుండా క్యూఆర్ కోడ్ మార్చి.. రూ.లక్షల్లో మోసాలకు పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తొరైపాక్కంలో జరిగింది. ఇదే ప్రాంతంలో ఆనంద్(39) అనే వ్యక్తి టిఫిన్ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఈ దుకాణంలో అతను తన బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన పేటీఎం క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌ను అతికించాడు. వినియోగదారులు పంపిన డబ్బులు ఆనంద్ ఖాతాకు కొద్దిరోజులుగా రావట్లేదు. దీంతో మోసం జరిగిందని గ్రహించిన ఆనంద్.. కన్నగి నగర్ పోలీస్ స్టేషన్లో ఆగస్టు 3న ఫిర్యాదు చేశాడు.
కన్నగి నగర్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. విచారణలో బ్యాంక్ అధికారుల సహాయాన్ని సైతం తీసుకున్నారు. దీంతో పలు విషయాలు బయటపడ్డాయి. శ్రీధర్(21) అనే వ్యక్తి అకౌంట్లోకి ఆనంద్ ఖాతాలోకి జమ అవ్వాల్సిన డబ్బులు వెళ్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు నిందితుడు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
"నేను తిరువాన్మియూర్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నా. పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని వ్యాపారులను నమ్మించేందుకు నకిలీ గుర్తింపు కార్డును సిద్ధం చేసుకున్నా. వ్యాపారుల దుకాణాల వద్ద క్యూఆర్ కోడ్‌ను మార్చి.. నా క్యూఆర్ కోడ్‌ను పెట్టి డబ్బులు సంపాదిస్తున్నా. గత 15 రోజుల్లో 7 షాపుల్లో క్యూఆర్ కోడ్లు మార్చాను. "
-శ్రీధర్, నిందితుడు
నిందితుడు శ్రీధర్ నుంచి భారత్ పే క్యూఆర్ కోడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్‌ను ఆలందూరు కోర్టులో హాజరుపరిచి అనంతరం జైలుకు తరలించారు పోలీసులు.
ఇవీ చదవండి: 'నేను ఉపరాష్ట్రపతి కావాలనుకున్నానా?'.. మోదీ ఆరోపణలపై సీఎం కౌంటర్!
దర్జాగా పడుకొని ఫ్లైట్‌లో సిగరెట్ స్మోకింగ్.. డీజీసీఏ సీరియస్