6 year old girl organ donation: నోయిడాకు చెందిన ఆరేళ్ల బాలిక ఐదుగురికి ప్రాణదానం చేసింది. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి.. బ్రెయిన్‌డెడ్ అయిన ఆమె అవయవాలను దానం చేయాలన్న తల్లిదండ్రుల నిర్ణయం.. ఐదు జీవితాలను నిలబెట్టింది.
AIIMS girl saves 5 lives: రోలీ ప్రజాపతి(6) అనే బాలికపై నోయిడాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దుండగులు కాల్చిన తూటా ఆమె తలలోకి నేరుగా చొచ్చుకుపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాసేపటికే బాలిక కోమాలోకి వెళ్లిపోయింది. మెరుగైన చికిత్స నిమిత్తం దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. బాలికను కాపాడలేకపోయారు. బాలిక బ్రెయిన్‌డెడ్ అయిందని నిర్ధరణకు వచ్చారు.
"ఏప్రిల్ 27న రోలీని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె మెదడులోకి తూటా చొచ్చుకుపోయింది. దీంతో మెదడు పూర్తిగా దెబ్బతింది. బ్రెయిన్‌డెడ్ స్థితిలోనే ఆస్పత్రికి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానానికి ఒప్పించాం. ఇతర చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకు అవయవాలు దానం చేసేలా వారికి కౌన్సిలింగ్ ఇచ్చాం. ఇందుకు వారు ఒప్పుకోవడం అభినందనీయం. వారికి అవయవ దానం గురించి పూర్తిగా అవగాహన లేకున్నా.. ఇతర చిన్నారుల ప్రాణాలు నిలబడతాయన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు."
-డాక్టర్ దీపక్ గుప్తా, ఎయిమ్స్ సీనియర్ న్యూరోసర్జన్
బాలిక లివర్, రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు, గుండె కవాటాన్ని.. స్వీకరించినట్లు వైద్యులు తెలిపారు. ఎయిమ్స్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన అవయవ దాత రోలీనేనని దీపక్ గుప్తా వెల్లడించారు. '1994లో ఓపెన్ డొనేషన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. నాకు గుర్తున్నంత వరకు దిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో ఇంత చిన్న వయసు ఉన్న అవయవ దాత ఎవరూ లేరు' అని వెల్లడించారు.
అవయవ దానం గురించి వైద్యులు తమకు వివరించారని రోలీ తండ్రి హర్నారాయణ్ ప్రజాపతి పేర్కొన్నారు. తమ కూతురు లేకపోయినా.. అవయవ దానం వల్ల.. ఇతరుల్లో జీవించి ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: