Young Man Went To Bangladesh After 3 Years : సోషల్ మీడియా పోస్ట్ మానసిక స్థితి సరిగ్గా లేని ఓ యువకుడిని మూడేళ్ల తర్వాత తన స్వదేశానికి చేర్చింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ నయన్ మియాన్ అనే యువకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదు. అతడు ప్రమాదవశాత్తూ మూడేళ్ల క్రితం బంగ్లాదేశ్ సరిహద్దు దాటి బంగాల్లోని కూచ్‌బెహార్ జిల్లాలో ప్రవేశించాడు. అతడు దిన్హటా సహా వివిధ ప్రాంతాలలో తిరుగుతూనే ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత మెఖ్లిగంజ్‌లోని చంగ్రబంధ వీఐపీ కూడలి వద్ద యువకుడిని కొందరు రక్షించారు. వారు నయన్ పేరు, అడ్రస్ గురించి అడిగినా ఏమీ చెప్పలేకపోయాడు. ఆ తర్వాత నయన్ ఫొటోను తీసి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కొన్ని నెలల క్రితం నయన్ తండ్రి రహీదుల్ దృష్టికి చేరింది. ఆ తర్వాత సరిహద్దు దాటి భారత్ వచ్చేసిన కుమారుడిని స్వదేశానికి తీసుకెళ్లేందుకు రహీదుల్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
అయితే కొన్నాళ్ల క్రితం నయన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి బెర్హంపుర్ జైలులో వేశారు. మెఖ్లిగంజ్ సబ్ డివిజినల్ కోర్టు ముందు హాజరుపరచగా, నయన్‌ను మానసిక ఆస్పత్రిలో చికిత్స చేయించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందిన నయన్ త్వరగా కోలుకున్నాడు. అప్పుడు నయన్ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడానికి కోర్టు అనుమతినిచ్చింది. అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే నయన్‌కు పాస్‌పోర్ట్ లేకపోవడం వల్ల బంగ్లాదేశ్‌కు పంపేందుకు పోలీసులకు కాస్త ఆలస్యమైంది.
అంతలోనే పాస్‌పోర్టు, సంబంధిత పత్రాలతో చంగ్రబంధ చెక్ పోస్ట్ ద్వారా భారతదేశానికి వచ్చాడు నయన్ తండ్రి రహీదుల్. కుమారుడి కోసం వెతకడం ప్రారంభించాడు. ఎలాగోలా నయన్ ఆచూకీని తెలుసుకున్నాడు. చివరకు నయన్‌ను చంగ్రబంధ ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ వద్ద బంగ్లాదేశ్ అధికారుల సమక్షంలో అతడి తండ్రి రహీదుల్కు అప్పగించారు.
'నా కొడుకును ఇంటికి తీసుకెళ్లగలిగినందుకు ఆనందంగా ఉంది. సోషల్ మీడియాలో నయన్ ఫొటో పోస్ట్ చేయకపోతే అతడి ఆచూకీ లభ్యమయ్యేది కాదు. భారత అధికారుల చొరవను అభినందించాలి' అని నయన్ తండ్రి రహీదుల్ తెలిపారు. మరోవైపు, చట్ట ప్రకారం బంగ్లాదేశ్ పౌరుడిని అతడి కుటుంబానికి అప్పగించినట్లు మెఖ్లిగంజ్ పోలీసులు తెలిపారు. మూడేళ్ల క్రితం తప్పిపోయిన యువకుడిని అతడి కుటుంబం వద్దకు చేర్చడం ఆనందంగా ఉందని చెప్పారు.
'అమ్మా మీ పిల్లలను స్కూల్‌కు పంపండి ప్లీజ్' రోజూ గ్రామంలోని ఇంటింటికీ వెళ్తున్న టీచర్లు!
ఫింగర్ ప్రింట్స్ లేకున్నా ఐరిస్‌తో ఆధార్ జారీ- కేంద్రం కీలక నిర్ణయం