ముంబయిలోని ఖార్ రైల్వేస్టేషన్లో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని.. స్నేహితురాలిని చంపే ప్రయత్నం చేశాడో యువకుడు. లోకల్ ట్రైన్ ఫ్లాట్‌ఫామ్‌పై.. ఆమెను రైలు కిందకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
ఇదీ జరిగింది..
బాధిత యువతికి నిందితుడు రెండేళ్లుగా స్నేహితుడు. ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తారు. గత కొంత కాలంగా నిందితుడు.. మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి.. అతన్ని దూరం పెట్టింది. యువకుడు ఆమెను తరచు కలుస్తూ వేధించడం మొదలుపెట్టాడు. అసహనానికి గురైన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా యువకుడు హింసించడం ఆపలేదు.
ఈ నేపథ్యంలో.. శుక్రవారం సాయంత్రం.. నిందితుడు యువతిని వెంబడించాడు. యువతితో పాటు అంధేరీ రైల్వేస్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కాడు. భయంతో యువతి.. ఆమె తల్లికి ఫోన్ చేసింది. ఖార్ రైల్వేస్టేషన్లో కూతురు కోసం వేచి ఉన్న బాధితురాలి తల్లిని నిందితుడు కలుసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతిని అక్కడే అడిగాడు. బాధితురాలు నిరాకరించడం వల్ల.. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి పరుగులు పెట్టాడు. ఇంతలో.. ఒక్కసారిగా వెనక్కి వచ్చి యువతిని రైలు కిందికి నెట్టడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు సుమేద్ జాదవ్‌గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇదీ చదవండి: నగ్న చిత్రాలతో యువతి మోసం- రూ.లక్షకు టోకరా