ఆధునిక మహిళలు ఇల్లు అనే నాలుగు గోడలకే పరిమితం కావటం లేదు. గడప దాటి బయటకు వస్తున్నారు. ఆకాశమే హద్దుగా కలలు నెరవేర్చుకుంటున్నారు. సాధారణంగా మహిళలు నెలసరిలో ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటారు. అతివలకు ఇది అత్యంత సహజమైన విషయమే అయినా, ఇతరులతో చర్చించడానికి సంకోచిస్తుంటారు. మహిళలకు ఆ సమయంలో ఇబ్బందికి పరిష్కారంగా హ్యాపీనెస్ కిట్ రూపొందించాడు ఒడిశా జాజ్‌పూర్‌కు చెందిన యువ ఇంజినీర్ హృదానంద ప్రుస్టీ. ప్రాజెక్ట్ ప్రీతి.. ఏ హ్యాపీ రూమ్ ఫర్ ఉమన్ పేరిట ఆవిష్కరణను అందుబాటులోకి తెచ్చాడు.
"ఒక అమ్మాయి ఇంట్లో ఉన్న సమయంలో సురక్షితంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఎందుకంటే శానిటైజర్ ప్యాడ్, శానిటైజర్, క్లీన్ వాష్ రూమ్ వంటివి ఆమెకు అందుబాటులో ఉంటాయి. అదే అమ్మాయి రుతుస్రావం సమయంలో ఇంటి నుంచి బయటకెళితే అనేక కష్టాలు పడుతుంది. తన ఇబ్బంది ఎవరితోనూ పంచుకోలేదు. ప్రయాణంలో ఉన్నప్పుడు శానిటరీ ప్యాడ్లు, వాష్ రూమ్ అందుబాటులో ఉండవు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్ ప్రీతిని తీసుకువచ్చాను. దీని వల్ల ప్రభుత్వం మహిళల మరుగుదొడ్లను హ్యాపీ రూమ్‌లుగా మార్చవచ్చు."
-హృదానంద ప్రుస్టీ, యువ ఇంజినీర్
హ్యాపీనెస్ కిట్‌లో శానిటరీ ప్యాడ్, కాటన్, టిష్యూ, సబ్బు, శానిటైజర్‌తో పాటు మహిళల సౌకర్యం కోసం కుర్చీ ఏర్పాటు ఉంటుంది. పాఠశాలలు, కళాశాలలు సహా రద్దీ ప్రదేశాల్లోని మరుగుదొడ్లలో ఈ కిట్ అందుబాటులో ఉండేలా హృదానంద ప్రణాళిక రూపొందించాడు. ఈ ప్రాజెక్ట్ ఆచరణలోకి వస్తే ఇంటి వెలుపల సైతం మహిళలు ఎలాంటి ఇబ్బంది, బిడియం లేకుండా ఉండవచ్చు. ఆందోళన లేకుండా ఇతరరోజుల్లానే నెలసరి సమయంలో బయటకు వెళ్ళవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ కిట్‌ను మెచ్చుకుంది. సాంకేతిక ఆమోదం తరువాత ప్రాజెక్ట్‌ను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు ఈ కిట్‌పై మహిళలకు అవగాహన కల్పించడానికి హృదానంద “అభిజన మిషన్ ను ప్రారంభించాడు. దాదాపు 100మంది మహిళలను ఈ మిషన్‌లో భాగస్వాముల్ని చేశాడు.
"అమ్మాయి ఇంటి నుంచి బయటకు వెళ్లుతున్నప్పుడు నెలసరి ఎప్పుడు వస్తుందో కచ్చితంగా తెలియదు. బయట ప్రదేశంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా ప్రాజెక్ట్ ప్రీతికి రూపకల్పన చేశాం. ఆ అమ్మాయికి భద్రత అందిస్తోంది. బిడియం లేకుండా బాత్రూంకు వెళ్లి ఆ పై కొంత విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. ఏ అమ్మాయి నెలసరి సమస్యతో ఇబ్బంది పడకూడదని మేము ముందుకు వచ్చాం."
-అమిషా మొహంతి, అభిజన మిషన్ సభ్యురాలు
"నేను దిల్లీ వెళ్లి ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషకులు, సీనియర్ అధికారులకు ఈ ప్రాజెక్టు గురించి వివరించి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చాను. వారు ఈ ప్రాజెక్టును అభినందించారు. సమగ్రంగా పరిశీలించేందుకు సాంకేతిక బృందం ఏర్పాటు చేశారు. ఈ బృంద సభ్యులు దీనిని ఆమోదిస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చారు."
-హృదానంద ప్రుస్టీ, యువ ఇంజినీర్
ఈ ప్రాజెక్టు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని ప్రాజెక్టు ప్రీతిని ఆమోదించమని ఒడిశా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖతో సహా అన్ని జిల్లా న్యాయాధికారులకు హృదానంద లేఖ రాశారు. ఈ హ్యాపీనెస్ కిట్‌ను అందుబాటులోకి తెస్తే రుతుస్రావ సమయంలో మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇదీ చదవండి: కొవిడ్‌ను జయించి.. మృత్యువుతో ఓడిన కాంగ్రెస్ ఎంపీ