ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఎమ్మెల్యే రమేశ్ దివాకర్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'పిల్లలను మీరు కంటున్నప్పడు ప్రభుత్వం ఎందుకు వారి విద్యా ఖర్చులు భరించాలి' అని మహిళా బృందాన్ని ప్రశ్నించారు. తన నియోజకవర్గం ఔరైయాలో నిర్వహించిన ఓ బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు మినహాయింపు చేయాలని మహిళలు కోరగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"పిల్లలను మీరు కంటుంటే.. ప్రభుత్వం ఎందుకు వారి విద్యా ఖర్చులు భరించాలి? ప్రభుత్వ పాఠశాలలు ఉన్నవి ఎందుకు?"
-రమేశ్ దివాకర్, ఔరైయా ఎమ్మెల్యే
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆ బృందంలో ఉన్న ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను ఎన్నుకున్నది ప్రజలేనని దీటుగా బదులిచ్చారు. ఈ ఘటనపై భాజపా ప్రతినిధి సమీర్ సింగ్ స్పందించారు. రమేశ్ కుమార్ వ్యాఖ్యల గురించి తనకు తెలియదన్న ఆయన.. మహిళలతో అసభ్యంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. జనులందరి పార్టీ భాజపానని అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఏదైనా ఫిర్యాదు అందితే.. దర్యాప్తు చేపడతామని తెలిపారు.
రమేశ్‌కుమార్ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు భాజపా ఏ సహాయమూ చేయదని, మహిళలను అవమానపరుస్తుందని ఆ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరీ దుయ్యబట్టారు.
ఇదీ చూడండి:బంగాల్ బరిలో నెగ్గేదెవరు- దీదీ హ్యాట్రిక్ కొడతారా?