వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వేడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి జితిన్ ప్రసాద చేరిక, త్వరలో మంత్రివర్గ విస్తరణ వంటి పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిల్లీ పర్యటన మరింత ఉత్కంఠను రేపుతోంది. పర్యటనలో భాగంగా ఆయన నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ ఉదయం లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకున్న యోగి.. ఆయనతో సమావేశమయ్యారు. యూపీ మంత్రివర్గంలో మార్పులపై ప్రధానితో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దిల్లీకి వచ్చిన యోగి.. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. యూపీ తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో కొవిడ్ నియంత్రణ విషయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై గత కొంతకాలంగా విమర్శలు వస్తుండటంతో కేబినెట్‌లో మార్పులు చేర్పులకు భాజపా అధిష్ఠానం సిద్ధమైంది. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మోదీ అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన మాజీ ఐఏఎస్ అధికారి ఏకే శర్మకు యూపీ ప్రభుత్వం కీలక పదవి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక ఇటీవలే కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన యువనేత జితిన్ ప్రసాదకు కూడా మంత్రిపదవి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కాగా.. సీఎంను కూడా మార్చే అవకాశాలున్నట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగి దిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాష్ట్ర నాయకత్వంలో మార్పులు ఉండవని ఇటీవల భాజపా నేత ఒకరు మీడియాకు తెలిపారు.
ఇదీ చదవండి:
యూపీ భాజపాలో లుకలుకలు- యోగికి పార్టీ మద్దతు