Modi Yoga Day: ప్రపంచదేశాల్లో శాంతిని నెలకొల్పేందుకు యోగా దోహదం చేస్తుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. యోగా ఏ ఒక్కరికో చెందినది కాదు.. అందరిదనీ ప్రధాని తెలిపారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలో మైసూరు ప్యాలెస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం మోదీ మాట్లాడారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సహా ప్రపంచ దేశాలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
''భారత ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుంది. కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. యోగా దినోత్సవం.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక. ప్రస్తుతం యోగా ప్రపంచం నలుమూలలా విస్తరించింది. కరోనా విపత్తు సమయంలోనూ దీన్ని నిర్వహించాం. సమాజంలో శాంతి నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుంది.. జీవన విధానానికి మార్గంగా నిలుస్తుంది. ఇది వ్యక్తికే పరిమితం కాదు.. సకల మానవాళికి ఉపయుక్తమైనది. యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలి. ఐరాస, ఇతర దేశాలు యోగా సందేశం చేరవేస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పేందుకు యోగా దోహదం చేస్తుంది.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
యోగా కార్యక్రమం ముగిసిన అనంతరం.. యోగా ప్రాధాన్యం వివరిస్తూ మైసూర్లో ఏర్పాటుచేసిన డిజిటల్ ఎగ్జిబిషన్‌ను వీక్షించారు ప్రధాని. ఈ ఈవెంట్లో మోదీ వెంట కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు.
మన దేశంలో జన్మించి.. దశదిశలా వ్యాపించింది యోగా. వేదకాలం నుంచే భారత్‌లో యోగా ఉంది. జీవనశైలిలో ఎన్ని హైటెక్ వసతులు భాగమైనా మానసిక కుంగుబాటుకు యోగా సాధనే సమాధానం. అందుకే 2015లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. నేడు ఎనిమిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతున్నాయి. 'యోగా ఫర్ హ్యుమానిటీ' నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: Yoga Day: సులువైన యోగాసనాల సాధనతో మెరుగైన జీవనం..
17 వేల అడుగుల ఎత్తులో హిమవీరుల యోగాసనాలు.. గడ్డకట్టే చలిలోనూ సాహసాలు