Wrestlers Protest Support : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. రెజ్లర్ల ఆందోళనపై అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) స్పందించింది. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. మార్చ్ చేపట్టిన రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. రెజ్లర్ల నిర్బంధాన్ని, వారితో పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని UWW తెలిపింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై చేస్తున్న దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందన్న ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య.. రెజ్లర్ల ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరింది.
45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే.. భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ హెచ్చరించింది. కొద్ది నెలలుగా రెజ్లర్ల చేస్తున్న ఆందోళనను తాము గమనిస్తున్నామని.. ఈ నిరసనల ప్రారంభ రోజుల్లో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిని ఆయన బాధ్యతల నుంచి పక్కన పెట్టిన విషయం తమ దృష్టిలో ఉందని వివరించింది. బ్రిజ్ భూషణ్ ప్రస్తుతం WFI ఇంఛార్జ్ కాదని.. రెజ్లర్ల భద్రత, నిష్పాక్షిత దర్యాప్తు నిర్ధరించేందుకు మరోసారి సమావేశం నిర్వహిస్తామని UWW స్పష్టం చేసింది.
Brij Bhushan Wrestler Protest : బ్రిజ్ భూషణ్‌పై చర్యల విషయంలో కేంద్రం స్పందించకపోవడంపై రెజ్లర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజుల్లో స్పందించకపోతే తమ ప్రాణ సమానమైన పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామని హెచ్చరించారు. మంగళవారమే పతకాలను గంగలో కలిపేందుకు రెజ్లర్లు సిద్ధమవ్వగా.. చివరి క్షణంలో ఖాప్, రైతు సంఘాల నేతల విజ్ఞప్తితో ఆ నిర్ణయాన్ని విరమించుకుని కేంద్ర ప్రభుత్వానికి ఐదు రోజుల గడువు ఇచ్చారు.
Wrestlers Protest Issue : కాగా, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు తమను లైంగికంగా వేధించాడంటూ.. దాదాపు నెల రోజులకు నుంచి దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా తదితరులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం(మే 28) ఆందోళనలను తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ.. అటు వైపు మార్చ్ చేపట్టిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసుల నిర్బంధించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తోపు లాటలో పలువురు అథ్లెట్లు కింద పడిపోయిన దృశ్యాలు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం అధికారులు నిరసనకారులందరినీ నిర్బంధించారు. అథ్లెట్లు శాంతి భద్రతలను ఉల్లంఘించినందుకు.. తగిన విచారణ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే, రెజ్లర్ల దీక్షా శిబిరాన్ని కూడా తొలగించారు. ఆ తర్వాతే రెజ్లర్లు హరిద్వార్ వెళ్లి నిరసన చేపట్టారు.