Wrestler murder: వ్యక్తిగత కక్షల కారణంగా ఓ రెజ్లర్‌ను కత్తితో పొడిచి హత్యచేశారు దుండగులు. ఈ ఘటనలో రెజ్లర్ స్నేహితుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ జాన్పుర్లోని గౌరాబాద్షాపుర్లో శుక్రవారం రాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: బాదల్ యాదవ్ (21).. ధర్మాపుర్ ఠాకుర్చి గ్రామానికి చెందిన వ్యక్తి. అతడు తన స్నేహితుడు అంకిత్ యాదవ్‌తో (25) కలిసి శుక్రవారం రాత్రి బయటకు వెళ్లాడు. అంతలో దుండగులు కత్తులతో ఇరువురిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు పారిపోయారు. గాయపడ్డ యువకులిద్దరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాదల్ చనిపోయాడని వైద్యులు నిర్ధరించారు. అంకిత్ పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం వారణాసికి తరలించాలని సూచించారు. ఈ ఘటనపై ఆగ్రహంతో.. గ్రామస్థులు ప్రసాద్ జంక్షన్ రోడ్డును నిర్భందించారు. ప్రభుత్వ అంబులెన్స్‌కు నిప్పంటించి.. పోలీసు వాహనాలపై రాళ్ళు రువ్వారు. కొద్ది రోజుల క్రితం బాదల్, అంకిత్‌లకు.. వేరే వారితో గొడవ జరిగిందని, ఈ హత్యకు అదే కారణమై ఉండొచ్చని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలోనూ ఓ యువ రెజ్లర్ హత్య: గతేడాది మే 4న దిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద రెండు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన కొట్లాటలో సాగర్ అనే 23 ఏళ్ల రెజ్లర్ మరణించాడు. భారత్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ దాడి చేయడం వల్లే సాగర్ చనిపోయాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సుశీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుశీల్‌తో ఒకప్పుడు సాగర్‌కు మంచి సంబంధాలే ఉండేవి. దిల్లీలోని మోడల్ టౌన్‌లో సుశీల్ ఇంటిలోనే సాగర్ అద్దెకు ఉండేవాడు. అయితే కొన్ని నెలల పాటు అద్దె చెల్లించకపోవడం వల్ల అతడితో సుశీల్‌కు గొడవ జరిగింది. ఈ తరుణంలో సుశీల్‌ను దూషించిన సాగర్.. ఇతరుల ముందు అతడి గురించి అవమానకరంగా మాట్లాడేవాడట. ఇది తట్టుకోలేక సుశీల్ బృందం సాగర్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: హెల్పర్‌ను చంపి.. శవాన్ని మాయం చేసి.. 7 నెలలు పోలీసులకు చుక్కలు