కొవిడ్-19పై పోరుకు ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా సంస్థలు ఉత్పత్తి చేసిన టీకా వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని భారత సంతతికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు అసీమ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఈ టీకాను భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ వల్ల గుండెపోటు, పక్షవాతం, రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని మల్హోత్రా తెలిపారు. ఈ తరహా దుష్ప్రభావాలు ఉన్నాయంటూ ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్ టీకాలను నిషేధించాలని ఆయన చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కొవిషీల్డ్‌తో గుండెపై ఇంతకుమించిన స్థాయిలో నష్టాలు ఉంటాయని దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. బ్రిటన్‌లో ఈ టీకా పొందినవారిలో పది శాతం మందికి ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.
ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా టీకా వల్ల అతికొద్ది మందిలో రక్తానికి సంబంధించిన ఒక సమస్య ఉత్పన్నం కావొచ్చని బ్రిటన్ శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. దీనివల్ల బాధితుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుందని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్ధరణకు వచ్చారు. ఫలితంగా రక్తస్రావం ముప్పు పెరగడం, కొన్ని కేసుల్లో గడ్డలు ఏర్పడటం జరుగుతుందని చెప్పారు. ఆస్ట్రాజెనెకా టీకా పొందినవారిలో అతికొద్దిమందిలో ఇది ఉత్పన్నం కావొచ్చని 54 లక్షల మందిపై అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలు గుర్తించారు. 10 లక్షల డోసులు వ్యాక్సినేషన్‌కుగాను 11 మందిలో మాత్రమే ఇది తలెత్తుతుందని పేర్కొన్నారు.