World highest railway bridge ప్రకృతి సోయగాలకు జమ్ముకశ్మీర్ పెట్టింది పేరు. ఇక్కడి వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ లోయలోకే మరో అద్భుతం చేరింది. జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. కశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్‌లోని ఉదంపుర్-శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జి ఉంది. కత్రా-బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ వంతెన కీలకమైన అనుసంధానంగా నిలుస్తోంది. ఈ వంతెనను గోల్డెన్ జాయింట్‌గా పిలుస్తున్నారు. ఈ వంతెన చివరల నుంచి ఒక విల్లు ఆకారంలో ఉన్న నిర్మాణం.. బ్రిడ్జి మధ్యలో కలుసుకుంటుంది. మేఘాలపై వంతెన నిర్మించినట్లు కనిపిస్తున్న ఫొటోను రైల్వేశాఖ ట్విట్టర్లో షేర్ చేసింది.
చీనాబ్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు. ఈ వంతెన పొడవు 13,15 మీటర్లు కాగా.. ఈ నిర్మాణానికి దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు చేశారు. బలమైన గాలులతో పాటు, భూకంపాలను తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జి బరువు బరువు 10,619 మెగా టన్నులు అని తెలిపారు. ఈ వంతెన నిర్మాణంలో 28,660 మెగా టన్నుల ఉక్కును వినియోగించారు. ఈ బ్రిడ్జి మొత్తం 7 పిల్లర్లను కలిగి ఉండగా సంగల్‌దాన్ వద్ద ఉన్న పిల్లర్ అన్నింటికన్నా ఎత్తులో 103 మీటర్లు ఉంటుంది. ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. దీన్ని ఆఫ్కాన్స్ సంస్థ నిర్మించింది. 2004లో తలపెట్టిన ఈ ప్రాజెక్టు ఎన్నో అవాంతరాలు దాటుకుని ఇప్పుడు పూర్తయింది. కుతుబ్‌మినార్ కంటే ఎత్తైన ఈ నిర్మాణం.. బంగీ జంపింగ్ లాంటి సాహసోపేతమైన క్రీడలకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. ఈ వంతెన పర్యాటకంగా జమ్ముకశ్మీర్‌ను మరింత ఉన్నత స్థితిలో ఉంచుతుందని తెలిపారు.
ప్రస్తుతం కశ్మీర్ నుంచి దిల్లీకి సరకు రవాణా ట్రక్కులకు 48 గంటల సమయం పడుతుండగా ఈ బ్రిడ్జి ప్రారంభమైతే రైళ్ల ద్వారా కేవలం 20 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో రవాణా ఖర్చు తగ్గి కశ్మీరీ సరకులు చౌకగా లభిస్తాయని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: హోటల్‌కు పిలిచి మహిళపై అత్యాచారం చేసిన వ్యాపారి