World War bullet bike : గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన దేశాయ్ ఫ్యామిలీ రెండో ప్రపంచ యుద్ధం నాటి ద్విచక్ర వాహనాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. వందేళ్ల క్రితం తయారు చేసిన ఈ బైక్‌లను ఇప్పటికీ మంచి కండిషన్లో మెయింటెన్ చేస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్, లాంబ్రెటా, యెజ్డీ, జావా వంటి ప్రముఖ బైక్ మోడళ్లను సేకరించి ప్రదర్శనకు ఉంచింది దేశాయ్ కుటుంబం.
World War motorcycle : దేశాయ్ కుటుంబం ప్రధాన వృత్తి వ్యవసాయం. అయితే, కుటుంబ పెద్ద కృపలానీ దేశాయ్‌కు ద్విచక్రవాహనాలపై మక్కువ ఉండేది. దీంతో 1990 నుంచి బైక్‌లను సేకరించడం ప్రారంభించారు. ప్రపంచ యుద్ధంలో వాటిని బైక్‌ల గురించి తెలుసుకొని.. వాటిని సమీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దేశంలోని వివిధ నగరాల నుంచి ద్విచక్రవాహనాలను తన తండ్రి తీసుకొచ్చారని కృపలానీ కుమారుడు సిద్ధార్థ్ దేశాయ్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బైక్‌ల నిర్వహణ సిద్ధార్థే చూసుకుంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించిన బీఎస్ఏ ఎం20, నోర్టన్ 16, ట్రయాంఫ్ టైగర్ వంటి బైక్‌లు తమ వద్ద ఉన్నాయని సిద్ధార్థ్ తెలిపారు.
"ప్రస్తుతం మా వద్ద 45 బైక్‌లు ఉన్నాయి. ప్రపంచ యుద్ధంలో వాడిన బైక్‌లు సైతం ఉన్నాయి. బీఎస్ ఎం20 వంటి బైక్‌లను ప్రపంచ యుద్ధంలో వాడేందుకే తయారు చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత మిగిలిన బైక్‌లను బ్రిటిషర్లు ఇండియాకు తీసుకొచ్చారు. అప్పటి బ్రిటిష్ పోలీసులు వీటిని వాడేవారు. ఈ బైక్‌లు భారత్‌లోనే రిజిస్టర్ అయ్యాయి. కానీ, వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు."
-సిద్ధార్థ్ దేశాయ్, వింటేజ్ బైక్ మ్యూజియం నిర్వాహకుడు
సేకరించిన బైక్‌లను ప్రదర్శించేందుకు ఇంట్లోనే మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది దేశాయ్ కుటుంబం. ఇక్కడ 123 ఏళ్ల నాటి బైక్ కూడా ఉంది. పెడల్ తొక్కుతూ నడపగలిగే 'రాయల్ ఎన్ఫీల్డ్ 1910' బైక్ ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీటిని సేకరించేందుకు చాలా కష్టపడినట్లు సిద్ధార్థ్ దేశాయ్ చెబుతున్నారు.
"కొత్త బైక్ తీసుకోవాలంటే షోరూం నుంచి ఈజీగా కొనుక్కోవచ్చు. కానీ ఇలాంటి బైక్‌లు సేకరించడం చాలా కష్టం. అప్పట్లో పూనా, నాశిక్‌లలో ఇవి దొరికేవి. బైక్‌లు ఉన్నా.. అవి వారి యజమానుల ఇళ్లలో పనిచేయకుండా పడి ఉండేవి. కొన్ని బైక్‌లను మా తండ్రి పూనా, నాశిక్ల నుంచి తీసుకొచ్చారు. రాజస్థాన్, హైదరాబాద్, బరోడా సహా గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కొన్ని బైక్‌లను సేకరించాం. దేశవ్యాప్తంగా ఉన్న బైక్‌లను తీసుకొచ్చి రిపేర్లు చేసి నడిచే స్థితికి తీసుకొచ్చాం."
-సిద్ధార్థ్ దేశాయ్, వింటేజ్ బైక్ మ్యూజియం నిర్వాహకుడు
వింటేజ్ బైక్‌లకు ఎప్పటికప్పుడు రిపేర్లు చేయడానికి మెకానిక్‌లను నియమించుకుంది దేశాయ్ కుటుంబం. బైక్‌లను కండిషన్లో ఉంచడానికి నెలకు ఐదుసార్లు వాహనాలకు సర్వీసింగ్ చేస్తున్నట్లు సిద్ధార్థ్ దేశాయ్ చెబుతున్నారు. ఈ మ్యూజియాన్ని అమూల్యంగా కాపాడుకుంటూ వస్తున్నామని అంటున్నారు.