రైతుల డిమాండ్లను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని ప్రశాంతంగా కూర్చోనివ్వబోమని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న తమ ఆందోళనకు మద్దతు కూడగట్టేందుకు.. 40 మంది రైతు నాయకులు.. దేశ వ్యాప్తంగా తిరుగుతారని తెలిపారు.
ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ప్రభుత్వం తమకు అనుకూలంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదని టికాయిత్ అన్నారు. హరియాణాలోని కర్నల్ జిల్లా ఇంద్రి గ్రెయిన్ మార్కెట్ వద్ద నిర్వహించిన మహాపంచాయత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
"కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలు.. ప్రజా పంపిణీ వ్యవస్థను అంతం చేస్తాయి. వీటి వల్ల రైతులు మాత్రమే కాకుండా చిరు వర్తకులు, రోజూ కూలీలు ఇతర రంగాల వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. గోదాంలను ముందు నిర్మించారు. ఆ తర్వాత చట్టాలను తీసుకువచ్చారు.పెద్ద కార్పొరేటర్ల కోసమే ఈ చట్టాలను తెచ్చారని రైతులు ఆ మాత్రం పసిగట్టలేరా? ఆకలిపై వ్యాపారం చేయడానికి ఈ దేశంలో అనమతి లేదు."
--రాకేశ్ టికాయిత్, బీకేయూ నేత
రైతు సంఘాల నాయకులు, వేదికలు మారవని టికాయిత్ పునరుద్ఘాటించారు. టికాయిత్తో పాటు, బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్ పాల్, హరియాణా బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్ చదౌనీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రూ. లక్షన్నర కరెంట్ బిల్లు.. రైతు ఆత్మహత్య