రైతులు తమ ప్రాణాలనైనా త్యాగం చేస్తారు కానీ వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనలను మాత్రం వదిలిపెట్టరని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ స్పష్టం చేశారు.
దిల్లీ సరిహద్దు ప్రాంతం గాజీపుర్‌లో ప్రతినెలా నిర్వహిస్తున్న 'కిసాన్ మహా పంచాయత్'ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. రైతులతో చర్చలకు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నట్లు చెప్పిన ప్రభుత్వం.. ఐదు నెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్న తమ డిమాండ్లను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
''భాజపా నేతృత్వంలోని కేంద్రం పెట్టుబడిదారుల కోసం పనిచేస్తోంది. అందుకే నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై సవతి ప్రేమ చూపిస్తోంది. వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ రైతులను అంత తేలికగా తీసుకోకూడదు. వారు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయగలరు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడం మాత్రమే కాదు.. దేశంలోని రైతులంతా ఐక్యంగా ఉన్నారు. చట్టాల రద్దు డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాలి. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.''
-నరేశ్ టికాయిత్, బీకేయూ నేత
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో 5 నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తుండగా.. సవరణలు మాత్రమే చేస్తామని కేంద్రం చెబుతోంది.
ఇవీ చదవండి: 'తగిన చర్యలు చేపట్టకపోతే.. అసాధారణ విపత్తే'