Muzaffarpur eiffel tower: దూరం నుంచి చూస్తే ఏదో గడియార స్తంభం అనుకుంటారు. కానీ దగ్గరకు వెళ్తే మాత్రం ఇది ఇల్లు అని తెలుసుకుని కచ్చితంగా షాక్ అవుతారు. బిహార్ ముజఫర్‌పుర్ జిల్లా గన్నీపుర్కు కొత్తగా వచ్చేవారందరికీ ఎదురయ్యే అనుభవమే ఇది. కేవలం ఆరు అడుగుల వెడల్పు ఉన్న స్థలంలో ఏకంగా ఐదు అంతస్తుల ఇల్లు ఉండడమే ఇందుకు కారణం.

Wonder house Muzaffarpur:
కలల సౌధం..
6 feet wide building: సంతోష్, అర్చన భార్యాభర్తలు. దాచుకున్న డబ్బుతో చాలా ఏళ్ల క్రితం ఓ చిన్న స్థలం కొన్నారు. దాని పరిమాణం.. ఆరు అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవు మాత్రమే. అంత చిన్నపాటి స్థలంలో ఇల్లు కట్టలేరు. అలా అని.. ఎంతో కష్టపడి కొనుకున్న భూమిని అమ్ముకోలేరు. అందుకే ఎలా అయినా అక్కడే ఇల్లు కట్టాలని నిర్ణయించారు. బాగా ఆలోచించి 2012లో ఓ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకోసం ఓ ఇంజినీరు సాయం కూడా తీసుకున్నారు. 2015 నాటికి నిర్మాణం పూర్తిచేశారు.

45 అడుగుల పొడవులో దాదాపు సగం మెట్లకే కేటాయించారు. మిగిలిన సగంలో చిన్న గదులు నిర్మించారు. ఇటీవల కాస్త అదనపు హంగులు అద్ది.. ఈ భవనం ద్వారా ఆదాయం సంపాదించడమూ మొదలుపెట్టారు సంతోష్-అర్చన. ఓ అంతస్తును కంప్యూటర్ సెంటర్ కోసం అద్దెకు ఇచ్చారు. బుల్లి కిచెన్, చిన్న బెడ్రూమ్లు ఉండే మిగిలిన అంతస్తుల్లో ఉంటున్నారు సంతోష్ కుటుంబసభ్యులు.

గన్నీపుర్కే స్పెషల్ ఎట్రాక్షన్
సొంతింట కల సాకారం చేసి, అద్దె రూపంలో అదనపు ఆదాయం తెచ్చిపెడుతున్న ఈ ఇల్లు గన్నీపుర్కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అనేక మంది ఈ ఇంటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.
ఇలాంటిదే మరోటి..
దిల్లీలోనూ ఇలాంటి ఇల్లొకటి ఉందండోయ్. కేవలం ఆరు గజాల స్థలంలో నాలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. సాధారణ ఇళ్లల్లో ఉండే అన్ని వసతులు ఈ ఇంట్లో ఉన్నాయి. ఈ చిన్ని ఇల్లు విశేషాలు తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయాల్సిందే.
ఇదీ చదవండి: ఆ ఇంటికి క్యూ కడుతున్న పర్యటకులు.. ప్రత్యేకత ఏమిటంటే?