Women Reservation Bill In Parliament : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ చరిత్రాత్మక బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా.. ఈ బిల్లును సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుకు మద్దతుగా 215 మంది ఓటు వేసి ఆమోదం తెలిపారు. పార్లమెంటు ఉభయసభల్లోనూ ఈ చరిత్రాత్మక బిల్లు ఆమోదం పొందడం వల్ల దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్టయింది.
-
PHOTO | Rajya Sabha passes Nari Shakti Vandan Adhiniyam (Women's Reservation Bill). 215 MPs vote in favour of the bill.#WomenReservationBill2023 pic.twitter.com/LoCo8r1Ln7
— Press Trust of India (@PTI_News) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">PHOTO | Rajya Sabha passes Nari Shakti Vandan Adhiniyam (Women's Reservation Bill). 215 MPs vote in favour of the bill.#WomenReservationBill2023 pic.twitter.com/LoCo8r1Ln7
— Press Trust of India (@PTI_News) September 21, 2023PHOTO | Rajya Sabha passes Nari Shakti Vandan Adhiniyam (Women's Reservation Bill). 215 MPs vote in favour of the bill.#WomenReservationBill2023 pic.twitter.com/LoCo8r1Ln7
— Press Trust of India (@PTI_News) September 21, 2023
'డీలిమిటేషన్ పూర్తి చేయకపోతే వారు రాజీనామా చేయాలి'
అంతకుముందు, వీలైనంత త్వరగా నియోజకవర్గాల పునర్వవ్యవస్థీకరణను పూర్తి చేసి.. మహిళా రిజర్వేషన్ల బిల్లును అమల్లోకి తేవాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ సూచించారు. రాజ్యసభలో మహిళా బిల్లుపై చర్చలో పాల్గొన్న ఆయన.. 1972లో డీలిమిటేషన్ ప్రక్రియ నాలుగేళ్లపాటు సాగిన విషయాన్ని గుర్తు చేశారు. 2029లోపు నియోజకవర్గాల డీలిమిటేషన్ పూర్తి చేయకపోతే... ప్రధానమంత్రి, హోంమంత్రి రాజీనామా చేసేలా ప్రకటన చేయాలని అన్నారు.
"ఈ బిల్లు 2014లో ఎందుకు ఆమోదం పొందలేదో.. 2023లో ఇప్పుడు ఎందుకు ఆమోదం పొందుతుందో మనందరికీ తెలుసు. ఈ దేశంలో ఇప్పటివరకు మూడుసార్లు నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. 1972లో ప్రారంభమైన డీలిమిటేషన్ ప్రక్రియ 1976 వరకు సాగింది. దేశంలో 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దేశంలో 2001, 2011 సంవత్సరాల్లో జనగణన ఎలాంటి అంతరాయం లేకుండా జరిగింది. 2021 జనగణన మాత్రం ఇప్పటివరకు జరగలేదు. కొవిడ్ కారణంగా ఆ సమయంలో జనగణన చేపట్టలేదన్న కారణం చెప్పారు. అమెరికా, ఇంగ్లాండ్, చైనా వంటి దేశాలు ఈ కరోనా సమయంలోనే తమ జనగణనను పూర్తి చేశాయి. 2029లోపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాకపోతే ఈ బిల్లు అమలు చేయలేం. 2029లోపు డీలిమిటేషన్‌ను పూర్తి చేస్తామని ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఈ సభలో ప్రకటన చేయాలి. లేకపోతే తర్వాత అధికారంలోకి ఎవరు వచ్చినా ప్రధాని, హోంమంత్రి రాజీనామా చేయాలి."
-- కపిల్ సిబల్, రాజ్యసభ ఎంపీ
2014, 2019లో మహిళా రిజర్వేషన్ బిల్లును తెస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదనని సీపీఎం పార్టీ ఎంపీ ఎలమరం కరీం విమర్శించారు. తొమ్మిదేళ్లుగా మహిళలు రిజర్వేషన్లు కోల్పోవడానికి అధికార పార్టీయే బాధ్యత వహించాలన్నారు. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో ఓటమి తర్వాత.. బీజేపీ చేసిన ఎన్నికల జిమ్మిక్కు ఇది అని ఆయన ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమల్లోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. గత తొమ్మిదేళ్లలో బిల్లు తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, రాజకీయ లెక్కలతోనే ఇప్పుడు తీసుకొచ్చిందని ఆరోపణలు చేశారు.
Women Reservation Bill 2023 : సెప్టెంబర్ 19వ తేదీన.. లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగిన చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 454 మంది ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా.. ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు.
ఇది ఓ సువర్ణాధ్యాయం: మోదీ
మరోవైపు, మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీలకతీతకంగా ఈ బిల్లుకు మద్దతిచ్చిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. "భారత పార్లమెంటరీ ప్రయాణంలో బుధవారం నాటి సమావేశం ఓ సువర్ణ అధ్యాయం. ఆ చారిత్రక క్షణంలో ఈ సభా సభ్యులంతా భాగమయ్యారు. నారీ శక్తి గతిని మార్చడంలో మనం ఇప్పుడు చివరిమెట్టుపై ఉన్నాం. ఈ మార్పుతో కొత్త శక్తి ఆవిర్భవిస్తుంది. దేశం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుంది. ఈ బిల్లుకు మద్దతిచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలు" అని మోదీ తెలిపారు.
2029 తర్వాతే..
అయితే, ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. దీని అమలు మాత్రం 2029 తర్వాతేనని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. 2024 ఎన్నికలు కాగానే జన గణన, డీలిమిటేషన్ చేపడతామని, సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తెస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.