మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఓ మహిళ వేధింపులకు గురైంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇంటి పక్కనే ఈ ఘటన జరిగింది. శుక్రవారం తనతో ఓ గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ తెలిపింది. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దారుణం జరిగినట్లు ఆమె వెల్లడించింది. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. 24 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జుహు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని అరవింద్ వాఘేలా(47)గా పోలీసులు గుర్తించారు. ఇతడు ఒక వీధి వ్యాపారి. ఉత్తర విలేపార్లేలోని చలి అనే ప్రాంతంలో ఇతడు నివాసం ఉంటున్నాడు. శుక్రవారం బాధిత మహిళ ఓ ఆటోలో ప్రయాణం చేస్తోంది. అమితాబ్ బచ్చన్ ఇంటి పక్క నుంచి ఆటో వెళుతున్న సమయంలో.. ట్రాఫిక్ సిగ్నల్ పడింది. దీంతో డ్రైవర్.. ఆటోను అక్కడే ఆపాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నిందితుడు అరవింద్.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆటోలోనే ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. మహిళ ప్రతిఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని రంగంలోకి పోలీసులు.. నిందితుడిని పట్టుకున్నారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఘటనపై నిందితుడు నేరం ఒప్పుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.
సినిమా తరహాలో భార్యను చంపిన ఓ భర్త..
సినిమా తరహాలో భార్యను చంపాడు ఓ భర్త. 'నా కోసం ప్రాణాలిస్తావా..' అని భార్యను అడిగన భర్త.. ఆమె 'ఇస్తాను..' అని చెప్పగానే గొంతు నులిమి చంపాడు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఈ ఘటన జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరదలితో ప్రేమాయణం నడుపుతున్న నిందితుడు.. ఆమెను పెళ్లి చేసుకునేందుకే భార్యను హతమార్చాడని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బిత్రి చైన్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. పదరత్‌పుర్ గ్రామానికి చెందిన ఫరూఖ్ అనే వ్యక్తి తన భార్య నస్రీన్‌ను చంపేశాడు. నిందితుడు వృత్తిరీత్యా ఒక వైద్యుడు. భార్యను చంపిన అనంతరం నిందితుడు ఇంట్లో ఉన్న డబ్బు, నగలు ఎత్తుకెళ్లాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం.. ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి.. మృతురాలి భర్తే ఈ దారుణానికి పాల్పడ్డట్లుగా పోలీసులు తేల్చారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. "నిందితుడు కొద్ది రోజులుగా తన మరిదలితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకు అడ్డుగా ఉన్న నస్రీన్‌ను తొలగించుకోవాలని అనుకున్నారు. అందుకే భార్యను చంపేశాడు" అని పోలీసులు తెలిపారు.