ఓ రహదారి నిర్మాణ ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాఖండ్ బాగేశ్వర్‌లోని ఓ ఊరి మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చిప్కో ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చేలా.. చెట్లను ఆలింగనం చేసుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. వందలాది మహిళలు ఇందులో పాల్గొన్నారు.

ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
దేహ్రాదూన్‌లో కామేది దేవి-రంగారా-మజ్గావ్-చౌనాలా ప్రాంతంలో రహదారి నిర్మాణ ప్రాజెక్టుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే.. దీన్ని బాగేశ్వర్‌లోని జఖానీ గ్రామ మహిళలు వ్యతిరేకించారు. ఈ ప్రాంతం అటవీ దేవత 'కోట్గారీ దేవీ'కి చెందిందని వారు అంటున్నారు. రోడ్డు నిర్మాణం కోసం ఇక్కడి చెట్లను నరికివేయడాన్ని తాము అంగీకరించబోమని ముక్తకంఠంతో చెబుతున్నారు.

'గడ్డిని కూడా పెకలించనివ్వం'
జఖానీ గ్రామ సర్పంచ్ కమల్ మెహతా నేతృత్వంలో మహిళంతా సమావేశమై.. చెట్లను కాపాడాలని ప్రతిన బూనారు. ఇందులో భాగంగా.. చెట్లను హత్తుకుని తమ నిరసన తెలపాలని నిశ్చయించుకున్నారు. ఈ అటవీ ప్రాంతం నుంచి గడ్డిని కూడా తీసుకువెళ్లనివ్వబోమని హెచ్చరించారు.
"చనౌలా గ్రామంలో ఇప్పటికే ఓ రహదారి ఉంది. అలాంటప్పుడు ఇంకో రోడ్డును నిర్మించే అవసరం ఏముంది? మేము ఇక్కడి చెట్లను నరికివేయనివ్వము. చెట్ల నరికివేతతో మా పర్యావరణం మాత్రమే దెబ్బతినదు. ఈ ప్రాంతంలోని సహజ జలవనరులూ నాశనమవుతాయి."
-ఉద్యమకారిణి
ఏంటీ చిప్కో ఉద్యమం?
ఈ మహిళల ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఎన్నో పర్యావరణ ఉద్యమాలకు నాందిగా నిలిచిన.. 1973 నాటి చిప్కో ఉద్యమ స్ఫూర్తితో సాగుతోంది. ఉత్తరాఖండ్‌లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పర్యావరణ ఉద్యమకారుడు.. సుందర్‌లాల్ బహుగుణ ఆధ్వర్యంలో చిప్కో ఆందోళన ప్రారంభమైంది.
'పర్యావరణమే శాశ్వతమైన ఆర్థిక వ్యవస్థ' అని ఆయన ఇచ్చిన నినాదంతో ఈ ఉద్యమం ఊపందుకుంది. అహింసా పద్ధతిలో సాగిన ఈ ఆందోళన.. సత్యాగ్రహంగా కూడా పేరుపొందింది. ఈ ఉద్యమ ఫలితంగా.. 1980లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.. ఈ ప్రాంతంలో చెట్లు నరకడంపై 15 ఏళ్ల పాటు నిషేధం విధించింది. తర్వాతి కాలంలో ఈ ఉద్యమం..తూర్పు బిహార్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తర హిమాచల్, దక్షిణ కర్ణాటకకూ వ్యాపించింది.