భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వగ్రామ పర్యటన నేపథ్యంలో ఓ విషాద ఘటన జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్‌ను నిలిపివేసిన కారణంగా ఓ మహిళ మరణించారు.
ఇదీ జరిగింది..
కాన్పుర్ ఇండియన్ ఇండస్ట్రీస్ మహిళా విభాగం అధ్యక్షురాలు వందన మిశ్రా అనారోగ్యం పాలయ్యారు. అయితే.. శుక్రవారం ఆమెను గోవింద్‌పురి బ్రిడ్జి మీదుగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని అనుకున్నారు మిశ్రా భర్త. ఇదే సమయంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో.. గోవింద్‌పురి బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది.
దాదాపు గంట సమయం తర్వాత వాహనాలు కదిలేందుకు అనుమతించారు అధికారులు. మిశ్రాను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె మార్గ మధ్యలోనే మరణించారని వైద్యులు స్పష్టం చేశారు.
అయితే.. పోలీసులను బతిమిలాడినా వారు వాహనాన్ని పంపేందుకు అనుమతించలేదని, మిశ్రా మరణానికి వారే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాన్పుర్ పోలీస్ కమిషనర్ అసీమ్ అరుణ్ ఈ ఘటనపై క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత తమదేనని అన్నారు.
ఇదీ చదవండి:ఆ ఫ్రెండ్స్ కోసం రాష్ట్రపతి రైలు ప్రయాణం