బిహార్‌లో దారుణమైన ఘటన జరిగింది. ఓ దుర్మార్గుడు పదునైన ఆయుధంతో.. ఓ మహిళపై దాడిచేసి కాళ్లు, చేతులు, ఛాతి భాగాల్లో పొడిచి హత్య చేశాడు. శనివారం సాయంత్రం జరిగిందీ ఘటన. అప్పు విషయంలో వివాదమే ఇందుకు కారణం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భాగల్పుర్ జిల్లా పిరపైంతీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఛోటీ దిలోరా ప్రాంతానికి చెందిన నీలం దేవి(42) అనే మహిళ శనివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. షకీల్ అనే వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఆమె కాళ్లు, చేతులు, ఛాతి భాగాల్లో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. నీలం పరిస్థితి విషమంగా ఉన్నందును అక్కడ వైద్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం చికిత్స పొందుతూ నీలం దేవి మృతి చెందింది.
నిందితుడి షకీల్‌కు, మృతురాలు నీలం దేవికి గతంలో మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్లనే ఆమె అడగగానే షకీల్ ఏ పూచికత్తూ లేకుండా కొంత సొమ్మును అప్పుగా ఇచ్చాడు. నెలరోజులు క్రితం డబ్బు తిరిగి చెల్లించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దానికి మృతురాలి కుటుంబం కొంత సమయం అడగగా అతను నిరాకరించాడు. ఫలితంగా వారి మధ్య వివాదం చెలరేగింది. నిందితుడు నీలంపై కోపం పెంచుకున్నాడు. ఓ పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
తమకు న్యాయం చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని మృతురాలి భర్త కోరాడు. ప్రస్తుతం అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపడుతున్నట్లు ఏఎస్పీ బాబురామ్ తెలిపారు.
డ్రగ్స్‌కు బానిసై.. మామను చంపిన యువకుడు
పంజాబ్‌లో ఓ యువకుడు తన మామను హత్య చేశాడు. డ్రగ్స్ కారణంగానే ఆ యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణం రయ్య మండలంలోని బాబా బకాల గ్రామంలో జరిగింది.
నిందితుడు గత కొన్నిరోజులుగా డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. అయితే అతని మామ వాటిని తీసుకోకుండా అడ్డుకున్నాడు. దీంతో ఆవేశంలో ఆ యువకుడు తన మామపై కత్తితో దాడి చేసినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి:
లూడో గేమ్‌లో తనను తానే బెట్టింగ్ పెట్టిన మహిళ.. ఓడిపోయి ఇంటి యజమాని వశం!
గుజరాత్లో రెండో దశ పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రధాని, సీఎం