గుజరాత్ వడోదరా జిల్లాకు చెందిన పుష్పబెన్ అనే మహిళ.. సుదీర్ఘ పోరాటం తర్వాత కొవిడ్‌ను(Covid-19) జయించారు. కరోనాతో పాటు, కరోనా(Corona virus) అనంతర సమస్యలపై ఏకంగా నాలుగు నెలల పాటు యుద్ధం చేశారు. జిల్లాలోని ఆస్పత్రిలో గత నాలుగు నెలలుగా చికిత్స పొందిన ఆమె.. తాజాగా డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.
కొవిడ్ బాధితులు(Covid patients) సాధారణంగా ఒకటి లేదా రెండు వారాల్లో కోలుకుంటారని, ఇలాంటి కేసు మాత్రం ఇండియాలో ఇదే తొలిసారని ఎస్ఎస్జీ ఆస్పత్రి నోడల్ అధికారి పేర్కొన్నారు. మహిళకు దెబ్బతిన్న ఊపిరితిత్తులు తిరిగి పనిచేసేలా చేసేందుకు అనేక యాంటీబయాటిక్‌లు, ఇంజెక్షన్లు ఇచ్చినట్లు వివరించారు. ఇలా నాలుగు నెలల తర్వాత కొవిడ్‌ను జయించడం దేశంలోనే తొలిసారని చెప్పారు. రోగి.. ఇప్పటికీ ఆక్సిజన్ సపోర్ట్‌తోనే ఉన్నారని తెలిపారు.
"బాధితురాలి ఊపిరితిత్తులు 85 శాతం మేర దెబ్బతిన్నాయి. 99 శాతం.. ఇలాంటి వారు బతికే అవకాశం లేదు. అందుకే ఆమెను నేరుగా వెంటిలేటర్‌పై ఉంచాం. వెంటిలేటర్‌పై ఉంచిన తర్వాత 10-12 రోజుల్లో ఆమెకు కొవిడ్ నెగెటివ్ వచ్చింది. కానీ ఆమె ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. మెడికల్ భాషలో చెప్పాలంటే దీన్ని పల్మనరీ ఫైబ్రోసిస్ అంటారు. నాలుగు నెలలు చికిత్స పొంది విజయవంతంగా డిశ్చార్జ్ కావడం గుజరాత్లో ఇదే ప్రథమం. దేశవ్యాప్తంగా 4-5 కేసులు కనిపించినప్పటికీ.. అందులో బాధితులు బతకలేదు."
-ఎస్ఎస్జీ ఆస్పత్రి నోడల్ అధికారి
మరోవైపు, బాధిత మహిళ పుష్పబెన్ మాత్రం ఇన్నిరోజులకు ఇంటికి వెళ్లినందుకు సంతోషం వ్యక్తం చేశారు. చికిత్స జరుగుతున్నంత కాలం ధైర్యంగానే ఉన్నట్లు చెప్పారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సహకారంతో ఇప్పుడీ పరిస్థితుల్లో ఉన్నాని అన్నారు.
"నాలుగు నెలల తర్వాత నేను నా ఇంట్లో ఉన్నాను. చాలా సంతోషంగా కూడా ఉన్నాను. అక్కడి సిబ్బంది నా ధైర్యాన్నిపెంచారు. వాళ్ల కృషి వల్లే నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నా."
-పుష్పాబెన్, కొవిడ్‌ను జయించిన మహిళ
పుష్పాబెన్ పట్టుదలను ఎస్ఎస్జీ ఆస్పత్రి వైద్యులు మెచ్చుకుంటున్నారు. కోలుకున్న తర్వాత తమకు కృతజ్ఞతలు చెప్తూ మహిళ లేఖ రాశారని చెప్పారు.
ఇదీ చదవండి: ఫేక్ న్యూస్‌పై సుప్రీం గరం- 'ప్రతిదీ మతం కోణంలోనేనా?'