ఐదేళ్లుగా ఇరువురూ ప్రేమించుకున్నారు.. కులాలు ఒక్కటే.. పెళ్లి విషయంపై పెద్దలకూ ఎలాంటి అభ్యంతరాలు లేవు.. అంతా సవ్యంగా జరుగుతోంది.. అంతలోనే షాక్.. ప్రియుడికి యాక్సిడెంట్.. రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి... ఈ పరిస్థితుల్లో అతడితో వివాహం వద్దని తల్లిదండ్రులు వారించినా.. యువతి వినలేదు. చివరకు అతడినే పెళ్లాడింది. ఈ ఘటన తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని వెల్లియూర్లో జరిగింది.
కేసవనేరి గ్రామంలో నివసిస్తున్న ప్రకాశ్(25), వల్లియమ్మాల్పురానికి చెందిన దివ్య(22) గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే, అంతలోనే విధి వెక్కిరించింది. ప్రకాశ్‌కు యాక్సిడెంట్ అయింది. చెన్నై నుంచి బైక్‌పై వస్తున్న ప్రకాశ్.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముకకు దెబ్బ తగలడం వల్ల రెండు కాళ్లు కదలలేని స్థితికి చేరుకున్నాయి.
నడవలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇవేవీ దివ్య, ప్రకాశ్‌ల ప్రేమకు అడ్డురాలేకపోయాయి. ప్రకాశ్‌తో పెళ్లి వద్దంటూ ఎంతగా నచ్చజెప్పినా.. దివ్య పట్టించుకోలేదు. ఇన్నేళ్లు ప్రేమించిన అతడితోనే జీవితం కొనసాగించాలని భావించింది. దీంతో సెప్టెంబర్ 20న ఇరువురూ ప్రకాశ్ కుటుంబం సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లిని వ్యతిరేకిస్తున్న దివ్య కుటుంబ సభ్యులు.. ప్రకాశ్ ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చివరకు దివ్యను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రకాశ్.. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు. దివ్య కుటుంబంపై చర్యలు తీసుకొని ఆమెను, తనను కలపాలని కోరుతున్నాడు.
హిందువుగా మారి.. పేరు మార్చుకొని..
మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన మతాన్ని మార్చుకొని హిందువును పెళ్లాడాడు. హిందూ పద్ధతుల్లో మహిళను వివాహం చేసుకున్నాడు. తన పేరును సైతం మార్చుకున్నాడు. ఉజ్జయినికి చెందిన మహ్మద్ నిసార్‌కు.. ఎనిమిదేళ్ల క్రితం రాణి కాయస్థతో పరిచయం ఏర్పడింది. ఇరువురూ క్రమంగా ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
తొలి నుంచీ మహ్మద్ నిసార్‌కు హిందూ ఆచారాల పట్ల ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే హిందూ మతాన్ని స్వీకరించాడు. వేదమంత్రాల మధ్య మత మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పండితులు మహ్మద్ నిసార్ పేరును సోనూ సింగ్‌గా మార్చారు. ఆ తర్వాత మహిళను వివాహం చేసుకున్నాడు. భవిష్యత్‌లోనూ హిందువుగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. మందసౌర్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది నాలుగో సారి. మొత్తం నలుగురు వ్యక్తులు హిందూ మతంలోకి మారారు.
కుమారుడి పేరు మీద లేఅవుట్..
చనిపోయిన కుమారుడి పేరుమీద ఓ లేఅవుట్‌ను నిర్మించారు కర్ణాటకకు చెందిన దంపతులు. గడగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ తాలుకా, సురంగి గ్రామానికి చెందిన ద్యామన్నా నీలగిరి, జ్యోతి నీలగిరి దంపతులకు వివాహమైన ఎనిమిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. దీంతో అతడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏడాది పాటు అతడు ఆరోగ్యంగానే ఉన్నా.. ఆ తర్వాత బాలుడు జబ్బుపడ్డాడు. అతడికి బ్రెయిన్ ఫీవర్ అని తేలింది. ఆ వ్యాధితో పోరాడుతూ 2019 డిసెంబర్ 21న ప్రాణాలు కోల్పోయాడు.
ఆ తర్వాత కొద్దిరోజులకు చిన్నారిని దత్తత తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. అయితే, దత్తత తీసుకోవడం కన్నా.. చనిపోయిన కుమారుడి పేరుమీద పేదలకు గూడు కట్టివ్వడమే మంచిదని అనుకున్నారు. బాలుడి చికిత్స కోసం మూడు ఎకరాలు అమ్మిన దంపతులు.. తమ వద్ద ఉన్న రెండు ఎకరాలను సామాజిక కార్యక్రమాల కోసం వినియోగించాలని ఎకరా స్థలంలో లేఅవుట్ నిర్మించి.. గ్రామానికి చెందిన 40 మందికి ఉచితంగా ఇళ్లు ఇవ్వాలని 2021 డిసెంబర్ 21న నిర్ణయానికి వచ్చారు. గ్రామపెద్దల సమక్షంలో అర్హులను ఎంపిక చేయనున్నారు. దీంతో మిగిలిన ఎకరంలో.. గ్రామ మహిళా సంఘం, యువజన మండలికి స్థలం కేటాయించాలని దంపతులు ప్లాన్ చేసుకున్నారు. ఓ ఆలయానికి సైతం స్థలం ఇవ్వాలని భావిస్తున్నారు.