ఓవైపు సాంకేతికతలో దేశం వేగంగా పురోగమిస్తోంటే.. మరోవైపు.. మూఢనమ్మకాలతో అమాయకులు మోసపోతున్న ఘటనలు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. క్షుద్రపూజల ద్వారా రూ.80కోట్లు వస్తాయని ఓ మహిళను నమ్మించిన ఓ మాంత్రికుడు.. ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర వార్ధ జిల్లా రామ్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..
రామ్‌నగర్‌కు చెందిన మహిళకు ఓ కూతురు ఉంది. సహ ఉద్యోగి చెప్పడం వల్ల ఓసారి ఆమెను ఓ మాంత్రికుడు వద్దకు తీసుకెళ్లింది ఆ తల్లి. కోరికలు తీరని ఆత్మను తన కుమార్తె శరీరంలోకి పంపించడం ద్వారా రూ.80 కోట్లు వచ్చేలా చేస్తానని మాంత్రికుడు ఆమెను నమ్మించాడు. ఈ సాకుతో సంవత్సరం పాటు ఆమెపై లైగింక దాడి చేశాడు. పూజల పేరిట యువతిని నగ్నంగా చిత్రీకరించి, ఆమె శరీరంపై నిమ్మకాయలు తిప్పుతూ అమానవీయ రీతిలో ప్రవర్తించాడు. మాంత్రికుడు పెడుతున్న బాధ తట్టుకోలేక.. బాధితురాలు అక్కడి నుంచి పారిపోయింది.
అనంతరం తన కూతురు తప్పిపోయిందని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాధిత యువతిని ఆచూకీని కనుగొన్నారు. ఈ క్రమంలో సదరు యువతి తానున్న పరిస్థితిని పోలీసులను వివరించి తనను కాపాడాల్సిందిగా వేడుకొంది.
చర్యలు చేపట్టిన పోలీసులు.. ఈ ఘటనలో ధనాజీ హాలక్, బలూ మంగ్రుట్కర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: ఆ బాలుడి ఆకలి బాధకు ఎంగిలి ప్లేటే దిక్కాయే!
ఇదీ చదవండి: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
కోడ్ భాషతో..
బాధిత యువతి కుటుంబ సభ్యులు క్షుద్రపూజలు నిర్వహించే వ్యక్తిని డాక్టర్‌గా సంబోధించేవారు . బాధితురాలిని 'కువారా పేపర్', 'విద్వా పేపర్' అనే కోడ్ పదాల్లో పిలిచేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
అంతరాష్ట్ర ముఠాలూ..
ఈ కేసులో ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులూ ఉన్నారని పోలీసులు తెలిపారు. డబ్బు, బంగారు నాణేల వర్షం కురిపించినట్లు నటిస్తూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడతారని వివరించారు. అయితే సమాజానికి భయపడి ఫిర్యాదు చేసేందుకు చాలామంది ముందుకు రావడం లేదని తెలిపారు. అంతేగాక చాలా కేసుల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నందున బాధితులు మౌనం వహిస్తున్నారని పేర్కొన్నారు.
బాధితురాలి తల్లి అత్యాశ, మూఢ నమ్మకాలే ఈ ఘటనకు కారణమని మూఢ నమ్మకాల నిర్మూలనకు కృషి చేసే 'అంధశ్రద్ధా నిర్మూలన్ సమితి' కన్వీనర్ పంకజ్ వంజారి తెలిపారు. ఇలాంటి నేరాలకు ఆస్కారం ఉందనే అనుమానం కలిగిన వెంటనే పోలీసులను లేదా తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
కన్యత్వ పరీక్షలో విఫలం- ఇంటి నుంచి వెళ్లగొట్టిన భర్తలు