Woman Gave Birth Child With Husband Sperm : మరణించిన భర్త వీర్యాన్ని మహిళ(48) అండంలో IVF పద్ధతిలో ప్రవేశపెట్టడం ద్వారా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ ఘటన బంగాల్లోని భీర్భూమ్ జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
మురారై ప్రాంతానికి చెందిన సంగీత, అరుణ్ ప్రసాద్‌కు 27 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ సంగీతకు గర్భాశయంలో సమస్యలు ఉండడం వల్ల చాలా ఏళ్లు ఆమెకు సంతానం కలగలేదు. దీంతో సంగీత, అరుణ్ ప్రసాద్ దంపతులు IVF విధానంలో పిల్లల్ని కనాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం సంగీత భర్త అరుణ్ ప్రసాద్ వీర్యాన్ని కోల్‌కతాలోని ఓ ల్యాబ్‌లో భద్రపరిచారు. అయితే అంతలోనే అరుణ్‌కు కొవిడ్ సోకి మరణించారు. భర్త మరణాన్ని తట్టుకోలేక సంగీత తీవ్రంగా బాధపడింది.
కొన్నాళ్ల తర్వాత సంగీత తన భర్త వీర్యాన్ని తన అండంలో ప్రవేశపెట్టి IVF పద్ధతి ద్వారా బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. అలా IVF పద్ధతిలో అరుణ్ ప్రసాద్ వీర్యాన్ని సంగీత అండంలోకి ప్రవేశపెట్టడం వల్ల ఆమె గర్భవతి అయ్యింది. మంగళవారం(డిసెంబరు 12న) రాంపుర్హాట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సంగీత కుమారుడు రెండున్నర కేజీల బరువుతో జన్మించాడని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
భర్త చనిపోయిన తర్వాత సంగీతను అత్తింటివారు పట్టించుకోలేదని స్థానికులు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఒంటరిగా జీవిస్తోందని, గర్భం దాల్చిన సమయంలోనూ ఆమె వెంట ఎవరూ లేరని చెబుతున్నారు. అరుణ్‌కు కిరాణా షాప్ ఉండేదని అతడి మరణాంతరం సంగీతనే ఆ దుకాణాన్ని నడుపుతోందని స్థానికులు వెల్లడించారు. అంతేకాకుండా సంగీత ధైర్యంపై ప్రశంసలు కురిపించారు.
'సంగీత చాలా క్లిష్ట పరిస్థితుల్లో తల్లి అయ్యింది. గర్భం దాల్చే వయసు దాటిపోతున్నా ఆమె ధైర్యంగా తన భర్త వీర్యంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ధైర్యానికి సెల్యూట్. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు' అని రాంపుర్‌హట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యుడు ఒకరు తెలిపారు.