Woman Gang Raped In Rajasthan: రాజస్థాన్ దౌసా జిల్లాలో దారుణం జరిగింది. ఒంటరిగా వెళుతున్న మహిళపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. ఆపై ఆమెను హత్య చేసి బావిలో పడేశారు. ఈ అమానవీయ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
దౌసా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఒంటరిగా ఇంటికి వెళుతుంది. ఇది గమనించిన దుండగులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించారు. మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్లు ఏఎస్పీ లాల్‌చంద్ కయల్ తెలిపారు.
12 ఏళ్ల బాలికపై అత్యాచారం: రాజస్థాన్ బంస్వారాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ యువకుడు. సోమవారం రాత్రి బాధితురాలు, తల్లితో కలిసి ఇంట్లో ఉండగా ఈ ఘటన జరిగింది. అడ్డు చెప్పిన తల్లిని గొంతు నులిమి గాయపరిచాడు. అనంతరం బాలికను అడవిలోకి ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పక్క గ్రామంలో ఓ వివాహం ఉండగా బాధితురాలి కుటుంబ సభ్యులు వెళ్లారు. ఇంట్లో తల్లి, కూతురు మాత్రమే ఉన్నారు. ఇది గమనించిన యువకుడు.. ఇంట్లోకి ప్రవేశించి బాలికను అడవిలోకి తీసుకెళ్లాడు. అడ్డు వచ్చిన తల్లి గొంతు నులిమి హత్య చేసేందుకు యత్నించాడు. అడవిలోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేసిన యువకుడు.. సమీపంలోని ఇంటి వద్ద బాలికను వదిలేసి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న కుటంబసభ్యులు తల్లి, కూతురిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడి కోసం గాలించగా.. అతడు పరారయ్యాడు. ప్రస్తుతం ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మేనకోడలికి నిప్పంటించిన మామ : ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన మేనకోడలికి నిప్పంటించాడు. ఈ ఘటన జిల్లాలోని బైద్యనాథ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిద్యానగర్లో జరిగింది. బాధితురాలి శరీరం 70 శాతం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు.
బిద్యానగర్కు చెందిన సిప్రాన్ దిగాల్ సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అతడి సోదరి ఇంటి బయట కూర్చొని ఉండగా.. ఆమె కుమార్తె గాయత్రి ఇంట్లో పడుకుంది. మద్యం మత్తులో ఉన్న దిగాల్.. ఇంట్లోకి వెళ్లి గాయత్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె అరుపులు విన్న తల్లి, స్థానికులు వెళ్లి గాయత్రిని రక్షించారు. వెంటనే గాయత్రిని కటక్‌లోని ఎస్సీబీ వైద్య కళాశాలకు తరలించారు. ఆమె శరీరం 70 శాతం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. దిగాల్ను అదుపులోకి తీసుకున్న స్థానికులు.. పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: భారత్‌పై దుష్ప్రచారం.. 16 యూట్యూబ్ ఛానళ్లు బ్యాన్