ఒడిశా భువనేశ్వర్లో మంచేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబరు11న జరిగిన ఈ ఘటన బాధితురాలు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ఘటనలో ముగ్గురు నిందితులను దేబాషిస్ ప్రధాన్, దీపక్ కుమార్ సేథీ, స్వాధీన్ కుమార్ నాయక్లుగా గుర్తించారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. డిసెంబర్ 11 సాయంత్రం దీపక్ అనే వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశాడు. వేడుకలలో భాగంగా కేకలు వేస్తూ పెద్ద శబ్దాలు చేయటం వల్ల పక్కనే నివసిస్తున్న ఓ మహిళ అభ్యంతరం తెలిపింది. దీంతో ఆమెపై ఆగ్రహించిన నిందితులు ముగ్గురూ మహిళను ఓ ఇంట్లోకి లాక్కెళ్లిపోయారు. తర్వాత వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లో లేడు.
బాధితురాలు సహాయం అరవగా.. ఆమె కేకలు విన్న కొందరు ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని నిందితుల బారి నుంచి మహిళను రక్షించారు. అయితే అక్కడి నుంచి వెళ్లే ముందు నిందితులు ముగ్గురూ బాధితురాలిని చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం. చివరకు పోలీసులను ఆశ్రయించిన మహిళ.. జరిగిన విషయాన్ని చెప్పింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.