Woman Free Service For Bedridden Patients In Kerala : విద్యార్థులకు సూచనలు చేస్తూ మరోపక్క రోగులను చూసుకుంటూ కనిపిస్తున్న ఈమె పేరు శోభన. వ్యక్తిగత ఆకాంక్షలన్నీ పక్కనబెట్టి 17 ఏళ్లుగా మానవతా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారామె. పెళ్లి చేసుకోకుండా, ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ నిరుపేద రోగుల బాగోగులు చూసుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటింటికి వెళ్లి రోగులకు అవరసరమైన సాయం అందిస్తున్నారు.
10 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా..
కేరళలోని కన్నూర్ జిల్లాలోని బక్కళం ప్రాంతానికి చెందిన శోభన.. వృత్తి పరంగా టీచర్. 10 సంవత్సరాలుగా చేస్తున్న ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి 2006లో మానవతా సేవ ప్రారంభించారు. బక్కళం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి క్యాన్సర్, ఇతర వ్యాధులతో బాధపడుతూ మంచాన పడిన నిరుపేద రోగులకు అవసరమైన మందులను ఇచ్చి వారికి సేవలు చేస్తున్నారు. ఒక్కోసారి శోభనతో పాటు మెడికల్ కాలేజీ నుంచి విద్యార్థులు వచ్చి సేవలు అందిస్తున్నారు.
క్యాన్సర్ బారినపడిన తన సోదరుడి భార్య అవస్థలను కళ్లారా చూశారు శోభన. ఆమె మరణించిన తర్వాతి నుంచి రోగులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. సంజీవని పాలియేటివ్ కేర్ సహకారంతో రోగులకు అవసరమైన మందులు అందిస్తున్నారు.
"సమాజం కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. అప్పుడే రోగులకు అవరసరమైన సేవ, మందుల సహాయాన్ని అందించాలని అని నిర్ణయించుకున్నాను. సంజీవని పాలియేటివ్ కేర్ సహాయంతో నేను ఇలా చేయటం మొదలుపెట్టాను. నాకు సాయంగా ఒక అంబులెన్స్ డ్రైవర్, నర్సును సాయంగా తీసుకువెళ్లి రోగులకు అవసరమైన సేవ చేస్తున్నాం. మెడికల్ ఆఫీసర్ లతీశ్ కుమార్ నేతృత్వంలో డాక్టర్, వాలంటీర్లు, టీచర్స్ కూడా కొన్నిసార్లు ఈ సేవలో పాల్గొంటున్నారు. ఒక్కోసారి నర్సింగ్ మెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా వస్తారు. కలిసికట్టుగా అందరం కలిసి సమాజానికి మంచి చేయవచ్చు అని చెప్పాడానికి ఉదాహరణగా నిలుస్తున్నాం."
-శోభన, రోగులకు సేవ చేస్తున్న మహిళ
రోజూ సుమారు 30 మంది రోగులకు సేవ..
అంబులెన్స్ సాయంతో ఇంటింటికి వెళ్లి రోగులకు సాయం చేస్తున్నారు శోభన. ఇలా సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించి ప్రతిరోజూ 25 నుంచి 30 మంది రోగులకు సేవ చేస్తున్నారు. "మాకు నెలకు సుమారుగా లక్ష రూపాయల పైనే ఖర్చు అవుతుంది. శోభన వచ్చి మాకు ఉచితంగా చిక్సిత అందిచటం వల్ల మాకు ఆ భారం తగ్గుతుంది" అని ఓ పేషెంట్ చెప్పారు. ఉచితంగా సేవ చేయటం కోసం వివిధ షాపుల్లో అమర్చిన కాయిన్ బాక్సుల ద్వారా విరాళాలను సేకరిస్తున్నారు శోభన. ఆమె అంకిత భావాన్ని చూసి స్థానికులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
అనాథలకు అండగా అబ్దుల్.. 500 మృతదేహాలకు అంత్యక్రియలు
'ప్రజలకు వైద్యసేవ చేయడం చాలా గర్వంగా, ఆనందంగా ఉంది'!.. సమాజానికి ఏదైనా చేయాలని..