Woman Sexually Harassed by Cops: పోలీసులు లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువతి (19) బలవన్మరణానికి పాల్పడింది. ఆమె కుటుంబ సభ్యులు ఈమేరకు ఆరోపిస్తుండగా.. పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. బదాయూలోని తన ఇంటిలో బుధవారం రాత్రి ఆమె ఉరేసుకుని చనిపోగా కుటుంబ సభ్యులు గురువారం ఉదయం గుర్తించారు.
మృతురాలి కుటుంబీకుల సమాచారం మేరకు.. మే 9న ఆ యువతి కుటుంబీకులకు, వారి బంధువులకు మధ్య గొడవ జరిగింది. ఈ విషయమై అదేరోజు యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే కాకుండా.. తమ బంధువులు కూడా చేసిన ఫిర్యాదు ఆధారంగా తరచూ తమ ఇంటికి వచ్చి వేధించేవారని యువతి తల్లి ఆరోపించారు. ఈమేరకు బుధవారం తమ ఇంటికి వచ్చిన పోలీసులు తాను స్నానం చేస్తుండగా బయటకు లాక్కొచ్చారని, అనంతరం తనతో పాటు తన కుమార్తెను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి సాయంత్రం విడిచిపెట్టారని తెలిపారు.
పోలీసుల అమానవీయ ప్రవర్తన వల్లే తన బిడ్డ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సీనియర్ ఎస్పీ ఖండించారు. ఆ కుటుంబానికి నేర చరిత్ర ఉందని, ఆ యువతి కుటుంబ సభ్యులపై పలు కేసులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఓ పాత కేసులో అరెస్టు చేసేందుకే ఆ ఇంటికి పోలీసులు వెళ్లారన్నారు.
ఇవీ చూడండి: ఉగ్రవాదుల మరో ఘాతుకం.. ఈసారి కార్మికులపై కాల్పులు