Woman Constable Gender Change : ఓ మహిళా కానిస్టేబుల్.. తాను పురుషుడిగా మారేందుకు అనుమతించాలంటూ డీజీపీకి లేఖ రాసింది. అందులో తనకు మహిళగా ఉండటం ఇష్టం లేదని.. చిన్నప్పటి నుంచి పురుషుడిలా బతకాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే కోర్టును ఆశ్రయించడానికి కూడా వెనకాడనంటోంది. లింగమార్పిడి కోసం ఇప్పటికే వైద్యులను కూడా కలిసిందీ పోలీస్. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో జరిగింది.
ఇదీ జరిగింది
అయోధ్యకు చెందిన ఓ మహిళకు 2019లో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఆమె గోరఖ్‌పుర్‌లోని లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్- ఎల్ఐయూలో విధులను నిర్వర్తిస్తోంది. తాజాగా ఈ కానిస్టేబుల్.. ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీకి ఓ లేఖ రాసింది. అందులో తాను చిన్నప్పటి నుంచి జెండర్ డిస్పోరియాతో బాధపడుతున్నట్లు తెలిపింది. పోలీసు ఉద్యోగంలో చేరాక.. లింగమార్పిడి చేయించుకోవాలని అనిపించిందని చెప్పింది. అయితే లింగమార్పిడి చేయించుకునేందుకు ఇప్పటికే దిల్లీలోని పలువురు వైద్యులను సంప్రదించానని.. శస్త్రచికిత్సకు తన శరీరం తట్టుకుంటుందని నిర్ధరించుకున్న తర్వాత ఈ లేఖ రాశానని తెలిపింది.
ఈ విషయంపై స్పందించిన డీజీపీ కార్యాలయం.. గోరఖ్‌పుర్ పోలీసులకు ఓ లేఖ రాసిందని సమాచారం. అందులో ఆ మహిళా కానిస్టేబుల్‌కు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించిందని తెలుస్తోంది. ఆమె ప్రస్తుత మానసిక స్థితి ఎలా ఉందో.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. మహిళా కానిస్టేబుల్‌ను కూడా తమ కార్యాలయానికి పిలిపించిందని.. అక్కడ ఆమె తనకున్న సమస్యను చెప్పుకుందని తెలిసింది. అయితే ఈ విషయం అధికారికంగా బయటకు రాకున్నా.. పోలీసు వర్గాల్లో మాత్రం చర్చించుకుంటున్నారు.
అయితే, మహిళా కానిస్టేబుల్.. తనకు చిన్నప్పటి నుంచే అమ్మాయిల దుస్తులు ధరించడం అసౌకర్యంగా అనిపించేందని తెలిపింది. హార్మోన్లలో మార్పులు వచ్చాయని.. మానసికంగా కూడా అలాగే అనిపించేదని చెప్పింది. అయితే ఉద్యోగం వచ్చాక కూడా మగవారిలా జట్టు కత్తిరించుకోవడం, బుల్లెట్ బైక్ నడపడం, క్రికెట్ ఆడటం లాంటివి చేశానని తెలిపింది. తనని తాను మహిళగా అంగీకరించుకోవడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పింది. లింగమార్పిడిపై ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే హైకోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమని తెలిపింది.
కానిస్టేబుల్‌కు ఫుల్‌గా మద్యం తాగించి 'ఖైదీ' పరార్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
న్యాయం కోసం కోడి పుంజు పోరాటం.. స్టేషన్ ఎదుట బైఠాయింపు!.. ఏం జరిగింది?