Woman Body in Suitcase Mumbai : మహారాష్ట్ర ముంబయిలోని కుర్లా ప్రాంతంలో సూట్‌కేస్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నవంబర్ 19న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో శాంతి నగర్ సీఎస్‌టీ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్ బారికేడ్ దగ్గర సూట్‌కేస్ ఉన్నట్లు సమాచారం అందిందని కుర్లా పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకుని సూట్‌కేస్‌ను పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. చనిపోయిన మహిళ మృతదేహాన్ని శవపరీక్ష కోసం రాజావాడి ఆసుపత్రికి తరలించామని వివరించారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. క్రైమ్ బ్రాంచ్ సహకారంతో దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.
చనిపోయిన మహిళ ఎవరనేది ఇంకా నిర్ధరణ కాలేదు. ఆమె వయసు 25 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు టీ షర్ట్-ట్రాక్ ప్యాంటు ధరించి ఉందని చెప్పారు. ముంబయి తదితర ప్రాంతాల్లో మహిళలు తప్పిపోయినట్లు ఫిర్యాదులు అందాయా అనేది తెలుసుకుంటున్నామని వివరించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఆమెను చంపిన వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
పిల్లలతో డ్యామ్‌లో దూకిన వ్యక్తి.. ఇద్దరు మృతి
Man Jumps Into Dam with Kids : కుటుంబ కలహాలతో మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో 40 ఏళ్ల వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కలిసి డ్యామ్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కుంట నదిపై ఉన్న 'తోరన్ ఆనకట్ట' వద్ద ఆదివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
షాజాద్ ఆదివారం మధ్యాహ్నం తన ఇద్దరు కుమారులు (4, 7 ఏళ్లు), 8 ఏళ్ల కుమార్తెతో కలిసి డ్యామ్‌లో దూకినట్లు ఖర్గోన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బిఎల్ మండ్లోయ్ తెలిపారు. నీటిలో దూకిన షాజాద్, అతని కుమార్తెను అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు రక్షించారని.. ఇద్దరు కుమారులు నీటిలోనే మునిగిపోయారని ఆయన తెలిపారు. షాజాద్ వారం రోజుల క్రితమే మరో పాపకు తండ్రి అయ్యాడని అధికారి తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు.. ఖర్గోన్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ తరుణేంద్ర సింగ్ బఘేల్ తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.