కేరళలో ప్రచార పర్వం ముగియడానికి ఇంకో వారం మాత్రమే మిగిలి ఉండగా.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. వివిధ పార్టీల జాతీయ స్థాయి నేతలు.. కేరళకు రానున్నారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
నేడు కేరళకు మోదీ..
పాలక్కడ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు పాల్గొననున్నారు. ఏప్రిల్ 2న తిరువనంతపురం, కోన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మోదీ మాత్రమే కాకుండా భాజపా తరఫున హోం మంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ వారంలో కేరళలో ప్రచారంలో పాల్గొననున్నారు.
కాంగ్రెస్ తరఫున...
నేడు ప్రియాంక గాంధీ.. కేరళకు చేరుకోనున్నారు. రెండురోజుల పాటు తిరువనంతపురం, కొల్లం, త్రిస్సూర్ జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. వయనాడ్, కోజీకోడ్ జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. రాహుల్ ఇప్పటికే.. కేరళలో రెండు సార్లు పర్యటించారు.
సీపీఎం తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచారీ, సీనియర్ నేతలు ప్రకాశ్ కారట్, బృందా కారట్ కూడా ఎన్నికల ప్రచారంలో ఈ వారం పాల్గొననున్నారు.
నకలీ ఓట్లు, ఆహార కిట్లు, బంగారం అక్రమ రవాణా, శబరిమల వంటివి.. గత వారం నేతల ప్రచారంలో ప్రధానాంశాలుగా నిలిచాయి.